Vidadala Rajini : ఫ్యాన్స్ ఉంటే ఆ కిక్కు ఉన్న వాళ్లకే తెలుస్తుంది. ఎందుకంటే వారు చూపించే అభిమానం ఊహించని విధంగా ఉంటుంది. ఎక్కువగా స్వచ్చమైన అభిమానం సినీ హీరోలపై ఉంటుంది. వాళ్ల నటనకో.. డాన్సులకో.. డైలాగులతో ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోతారు. రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కానీ.. వారి అభిమాన ప్రదర్శన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే రాజకీయ నేతలు పార్టీ మారినప్పుడల్లా వారు పార్టీ మారాలి.. పార్టీ మారకపోయినా కొంత మంది మారిపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అభిమానం కృతకంగా ఉంటుంది. పార్టీలో మేలు చేసినప్పుడో.. మరో రకమైన ప్రయోజనం కల్పించినప్పుడో మాత్రమే అభిమానం చూపిస్తారు. ఇలాంటి అభిమానాన్ని తాజాగా ఏపీ మంత్రి విడదల రజనీ చూశారు.
చిలుకలూరిపేట ఎమ్మెల్యేగా తొలి సారి గెలిచిన విడదల రజనీ .. వెంటనే కాకపోయినా మూడేళ్ల తర్వాత మంత్రి పదవిని అలంకరించారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉండే ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఆమెకు ఇటీవల ఓ అభిమాని ఓ బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి చూసుకుని ఆమె మురిసిపోయారు. ఆ బహుమతి ఏమిటంటే... రక్తంతో గీసిన విడదల రజనీ పెయింటింగ్. నిజమే.. మీరు చదివింది నిజమే.. ఆ అభిమాని.. మంత్రి విడదల రజనీ చిత్రాన్ని రక్తంతో గీసి ఆ పెయింటింగ్ తెచ్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు.
ఆ పెయింటింగ్ చూసి.. మంత్రిగారు మురిసిపోయారు. సినిమాల్లో అయితే ఇలాంటి రక్తపు పెయింటింగ్ అనే ఆలోచనలు ఎక్కువగా ప్రేమికుల మధ్య వస్తూంటాయి. కానీ ఇక్కడ మాత్రం విడదల రజనీ అభిమాని కొత్తగా ఆలోచించారు. తన ఆరాధ్య దైవానికి వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. మామూలుగా అయితే సినీ హీరోలయినా.. ఇతరులయినా ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే ముందుగా మురిసిపోయి.. తర్వాత మురిపెంగా విసుక్కుంటారు. అలాంటి పిచ్చిపనులు చేయడం కరెక్ట్ కాదని సుద్దులు చెబుతారు. కానీ ఏపీ మంత్రి విడదల రజనీ మాత్రం ఈ ఆ సీన్‌ను మర్చిపోయారు. బ్లడ్ పెయింటింగ్‌లో తన పెయింటింగ్‌ను చూసి మైమరిచిపోయారు. అలా చేయడం తప్పని చెప్పలేదు.
ముందుగా చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో స్వచ్చమైన అభిమానం ఉండదు. ఇక్కడ కూడా అదే. మంత్రి గారికి ఆ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి పేరు సాంబ. సోషల్ మీడియాలో విడదల రజనీ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తూంటారు. ఆయన సేవలను మెచ్చిన విడదల రజనీ చిలుకసలూరిపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్‌సీపీ కో కన్వీనర్ పదవి ఇప్పించారు. దాంతో సాంబకు అభిమానం ఉప్పొంగి.. రక్తంతో పెయింటింగ్ చేసేశారన్నమాట. అది తెచ్చి ఇచ్చారు.. మంత్రి గారు ఆనందపడ్డారు. తన ఘనతను.. సోషల్ మీడియాలో సాంబనే పంచుకున్నాడు.
అయితే రేపు ఎప్పుడైనా సాంబకు ఇతర పార్టీలో అంతకు మించిన పదవి వస్తే.. ఉంటారో వెళ్లిపోతారో చెప్పడం కష్టం కానీ.. అప్పుడు మంత్రి గారికి డౌట్ వచ్చి అసలు ఆ పెయింటింగ్ రక్తంతోనే చేసిందా లేదా అని టెస్టింగ్ చేస్తే.. ఏం బయటపడుతుందో చెప్పడం కష్టం. ఓ సినిమాలో .. తన లవర్‌ని బుట్టలో పడేయడానికి కోడి రక్తంతో లెటర్ రాస్తాడో కపట ప్రేమికుడు. అలాంటిదేమైా అయి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు కూడా..!