Today Top Headlines In AP And Telangana:


1. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం


తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం (AP Government) పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satyaprasad) ప్రకటించారు. కాగా, బుధవారం రాత్రి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో బైరాగిపట్టెడలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తోపులాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 48 మంది గాయపడగా వారిని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. ఇంకా చదవండి.


2. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ పూర్తి


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ (TTD) టోకెన్ల జారీని పూర్తి చేసింది. ఈ టికెట్లు కలిగి ఉన్న భక్తులను మాత్రమే ఈ నెల 10, 11, 12 తేదీల్లో శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. తొలి 3 రోజులకు 1.20 లక్షల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించగా.. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ ఈ కోటా టోకెన్ల జారీ ప్రక్రియను పూర్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 40 వేల చొప్పున 1.20 లక్షల టోకెన్లు జారీ చేశారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకూ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఏరోజుకారోజు ఇవ్వనున్నారు. ఇంకా చదవండి.


3. వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా.?


వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి..దక్షిణాయనం మొత్తం నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయం ఇది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకునే పుణ్యం అని భక్తుల విశ్వాసం. అయితే భక్తి భక్తిలా ఉన్నంతవరకూ పర్వాలేదు..కానీ అది పిచ్చిలా మారితేనే తిరుపతిలాంటి ఘటనలు జరుగుతాయి. వైకుంఠ ద్వారదర్శనం కోసం టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు, 48 మంది గాయపడ్డారు. ఇంకా చదవండి.


4. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు కేటీఆర్


ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10:10 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట లాయర్ రామచంద్రమూర్తి ఉన్నారు. ఈ కేసు విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు కేటీఆర్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, విచారణను దూరం నుంచి చూడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది ... విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని న్యాయవాదికి స్పష్టం చేసింది. ఇంకా చదవండి.


5. నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట


జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు (Mohan Babu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. గత నెల 23న ఆ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ క్రమంలో ఆయన ఈ తీర్పును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంకా చదవండి.