Lottory For Liquor Shops In AP: ఏపీలో మద్యం దుకాణాల లాటరీకి సమయం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి అంచనాలను మించి రూ.1,797.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రతి దుకాణానికి సరాసరి 25 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ (NTR), గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాల్లోని 113 దుకాణాలకు అత్యధికంగా 5,764 అప్లికేషన్స్ వచ్చాయి. సోమవారం మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నారు.


ఎక్సైజ్ శాఖ జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు చేపట్టనుంది. మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా తీస్తారు. ఈ క్రమంలో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 15న ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో అన్ని బ్రాండ్ల బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది.


నూతన మద్యం పాలసీ


కాగా, రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం 4 శ్లాబుల్లో లైసెన్స్ రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై 10 శాతం పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి. రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారులకు 20 శాతం మేర మార్జిన ఉంటుంది.


ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.కోటి. అటు, రాష్ట్రంలో రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. 


ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 దుకాణాలు కేటాయించనున్నారు. వాటిలో గౌడ, శెట్టిబలిజ వంటి కులాలకు 336, ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులాలకు చెందిన వారికి శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున 4 దుకాణాలు రిజర్వ్ చేశారు. అటు, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకూ వయా బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు.


Also Read: Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ,