Warangal Red chilli Price : మిరప రైతుల పంట పండింది. మార్కెట్లో ఎండు మిర్చి ధర దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకూ ధరలేక ఇబ్బందిపడ్డ రైతులకు కాస్త ఉపశమనం లభించింది. కోల్డ్ స్టోరేజీలలో ఎండు మిర్చిని దాచుకున్న రైతులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో ఎండు మిర్చి రికార్డ్ ధర పలుకుతోంది. తాజాగా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి క్వింటాల్ ధర రూ.90 వేలు పలికింది. దేశీ మిర్చి రకానికి డిమాండ్ పెరగడంతో అత్యధిక ధర నమోదైందని అధికారులు తెలిపారు.
రికార్డ్ ధర పలికిన ఎండు మిర్చి
హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన ఓ రైతు తన పంటకు రూ.90 వేలకు అమ్మాడు. ఇదే ఇప్పటి వరకు రికార్డ్ ధర అని అధికారులు తెలిపారు. ఇంతటి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీ రకానికి డిమాండ్ పెరగడం, ఆఫ్ సీజన్ కావడంతో ఈ రేటు వచ్చిందని అధికారులు చెప్తున్నారు. లక్షకు చేరువలో మిర్చి ధర పలకడంతో మిర్చి రైతులు సంతోషంగా ఉన్నారు. రెండు వారాల క్రితం మిర్చి ధర క్వింటా రూ.65 వేలు పలికింది. దేశీ మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడంతో ధర అమాంతం పెరిగింది. ఈ మిర్చిని పచ్చళ్లలో అధికంగా వినియోగిస్తారు. గతేడాది అకాల వర్షాలతో ఎండు మిర్చి దిగుబడులు తగ్గాయి. తెగుళ్లు కూడా మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏడాదికి 25, 30 క్వింటాళ్లు వచ్చే దిగుబడి కేవలం 10 నుంచి 15 క్వింటాళ్లు వచ్చాయి. దీంతో మార్కెట్లో మిర్చి సప్లై తగ్గిపోయింది. దీంతో రైతులు కాస్త మంచి ధరకే పంటను అమ్ముకున్నా దిగుబడి తగ్గిపోవడంతో నష్టాలు తప్పలేదు. మంచి ధరకోసం పంటను కోల్డ్ స్టోరేజీలలో దాచుకున్న రైతుల పంట పడింది. తాజాగా మంచి రేటు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిరులు కురిపిస్తున్న వరంగల్ మిరప
ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పండిస్తున్న ఎండు మిర్చి అంతర్జాతీయ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది కనీసం 20 వేల మెట్రిక్ టన్నుల ఎండు మిర్చిని సేకరించి రూ.10 కోట్ల లాభాన్ని ఆర్జించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి అధికంగా సాగుతోంది. ఈ మిర్చి నాణ్యతలో కూడా బాగుందని అధికారులు తెలిపారు. గతేడాది ఖమ్మం జిల్లాలో పొదుపు సంఘాల మహిళలు రూ.40 కోట్ల వ్యాపారం చేసి రూ.92 లక్షల లాభం పొందారు. రైతుల ఖాతాల్లో విక్రయాలకు సంబంధించి 15 రోజుల్లో నగదు జయ అయింది. లాభంలో ప్రతి కిలోకు రూ.4 చొప్పున రైతులకు బోనస్ అందించారు. రైతుల కల్లాల వద్దే పంటను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మిర్చి పంటకు భౌగోళిక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
Also Read : Mission Bhagiratha Award: మిషన్ భగీరథకు మరో కేంద్ర అవార్డు, 7 రోజుల్లో 5 విభాగాల్లో అవార్డులు
Also Read : RMP's in Telangana: ఆర్ఎంపీలకి సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్! ఆ పని చేస్తే క్రిమినల్ కేసులు - డైరెక్ట్ జైలుకే!