Mission Bhagiratha Award: ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగు నీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరో సారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మానన పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలి పెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది. శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ “మిషన్ భగీరథ” దేశానికే ఆదర్శంగా నిలిచింది.






మారుమూల ప్రాంతాలకూ తాగునీరు, అందుకే అవార్డు


మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం  జల్ జీవన్ మిషన్ ద్వారా  పరిశీలించింది. తెలంగాణ వ్యాప్తంగా రాండమ్ గా  ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ  నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది. 


మిషన్ భగీరథతో ప్రతీ రోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగు నీరు తలసరి 100 లీటర్లతో అందుతున్నట్టు గుర్తించింది. తెలంగాణలో అమలు అవుతున్న మిషన్ భగీరథ పథకం నాణ్యత మరియు పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా, ప్రతి రోజూ నాణ్యమైన తాగు నీరు అందిస్తున్నట్లు గుర్తించబడింది. 


తెలంగాణ సర్కారు కృషికి మరో గుర్తింపు..


ఈ క్రమంలో ‘రెగ్యులారిటీ కేటగిరీ’లో  తెలంగాణ, దేశంలోనే నంబర్ వన్ గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది. తాగు నీటి రంగంలో అద్భుతమైన, అనితరసాధ్యమైన పని తీరు కనబరుస్తూ మిషన్ భగీరథ  దేశంలోనే ఆదర్శవంతంగా నిలచింది. అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ఢిల్లీలో ఈ అవార్డును అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. జాతీయ జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ కు బుధవారం ఈ మేరకు లేఖ రాశారు. దేశంలోనే అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రశంసించారు. నల్లా నీటిని అందించడంలో తెలంగాణ రాష్ట్ర అద్భుతమైన, ఆదర్శ ప్రాయమైన పని తీరును కనబర్చిందని లేఖలో జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ పేర్కొన్నారు. ఈ అవార్డు అందించడం ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవనానికి శుద్ధి చేసిన తాగు నీటి సరఫరా ఎంతో తోడ్పడుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రగతిని గుర్తించి, మరో సారి జాతీయ స్థాయిలో  అవార్డుకు ఎంపిక చేసినందుకు, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.


7 రోజుల్లో 5 విభాగాల్లో అవార్డులు


గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఇప్పటికే రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు అందుకోవడానికి రాష్ట్రం నుండి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. గత ఏడు రోజుల్లో తెలంగాణకు ఐదు కీలక విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం విశేషం.