The Central Government Revised the VDA: దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అసంఘటిత కార్మికులతో పాటు రైతు కూలీల రోజు వారీ కూలి రేట్లను కేంద్రం పెంచింది. స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ కేటగిరీల్లో గరిష్ఠంగా వెయ్యీ 35 రూపాయలు కనిష్ఠంగా 868 రూపాయలు రోజు వారీ కూలీని నిర్ణయించింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.


ఇన్‌ఫ్లేషన్‌కు అనుగుణంగా రోజు వారీ కూలీల కొనుగోలు శక్తి పెంచడమే లక్ష్యమన్న కేంద్రం:


దసరా వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రోజు వారీ కూలీలకు శుభవార్త చెప్పింది. వేరియబుల్ డియర్‌నెస్ అలోయెన్స్‌- VDAను రివైజ్ చేయడం ద్వారా రోజు వారీ కూలీ రేట్లను పెంచుతూ గురువారం (సెప్టెంబర్ 26) నాడు కేంద్రం ప్రకటన చేసింది. పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ ధరలు రోజు వారీ కూలీలకు ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్న వారికి ఉపయుక్తంగా ఉంటాయని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. నిర్మాణ రంగం సహా లోడింగ్‌- అన్ లోడింగ్ పనులు చేసే వాళ్లు, స్వీపర్లకు, ఇళ్లల్లో పని చేసే వారికి, మైనింగ్ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ కూలీలకు ఈ రేట్లు వారి కొనుగోలు శక్తి పెంచడంలో సహకరిస్తాయని కేంద్రం పేర్కొంది.


అక్టోబర్ 1 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయి. భౌగోళికంగా దేశాన్ని A, B, C అని మూడు కేటగిరీలుగా విభజించి, అందులో స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కింద రోజువారీ వేతనాన్ని కేంద్రం సవరించింది. అన్‌స్కిల్డ్‌ కూలీలకు ఇకపై రోజుకు 783 రూపాయలు, నెలకు ఐతే 20 వేల 358 రూపాయలు కూలీగా అందనుంది. సెమీ స్కిల్డ్‌ కూలీలకు అయితే రోజుకు 954 రూపాయలు, నెలకు ఐతే 24 వేల 804 రూపాయల కూలీ అందుతుంది. అదే స్కిల్డ్ కూలీలకు ఐతే రోజుకు వెయ్యి 35 రూపాయలు లెక్కన నెలకు 26 వేల 910 రూపాయలు కూలీగా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది.


కేంద్రం ఏడాదికి రెండు సార్లు ఈ కూలీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఒకటి అక్టోబర్ 1 కాగా మరొకటి ఏప్రిల్ 1. 2023లో ద్రవ్యోల్బణం జూన్ నాటికి 5.57 శాతం ఉండగా 2024 జూలైకి 3.67 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఇండస్ట్రియల్ వర్కర్స్‌కు కన్సూమర్‌ ప్రైస్ ఇండెక్స్ సీపీఐ-ఐడబ్ల్యూ ఫిబ్రవరి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు కేంద్రం తెలిపింది.


దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో కేంద్ర పథకాల్లో నమోదు చేసుకున్న వారి సంఖ్య 30 కోట్లుగా ఉండగా వారిలో మహిళలు అత్యధికంగా 15.9 కోట్ల మంది ఉన్నారు. పురుషులు 13. 94 కోట్ల మంది ఉన్నారు. వీరిలో వయస్సుల పరంగా చూస్తే 18 నుంచి 40 ఏళ్ల వాళ్లు అధికంగా 60 శాతం మంది ఉండగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వాళ్లు 24 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీరిలో అత్యధికంగా 52 శాతం మంది వ్యవసాయ కూలీలుగా, 9 శాతం మంది ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్లు, మరో 9 శాతం మంది కన్‌స్ట్రక్షన్ రంగం వాళ్లున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కూలీల లెక్కలు ఇవి కాగా.. ఏ పథకంలో నమోదు కాని వారు ఇంకా కోట్ల మంది దేశంలో రోజు వారీ కూలీలుగా పని చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


Also Read: నెలలో 26 శాతం పెరిగిన వంటనూనె ధరలు - టైమ్‌ చూసి పెట్టిన వాత ఇది