Telangana News: తెంగాణలో వానాకాలం సీజన్ లో పెట్టుబడి సాయం కోసం 11వ విడత రైతు బంధు కింద నిధుల జమ ప్రక్రియ బుధవారం రోజు సంపూర్ణం అయింది. మొత్తం 68.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,624.74 కోట్లు జమ అయ్యాయి. ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున 1.52 కోట్ల ఎకరాలకు సాయం విడుదల అయింది. రైతుబంధు సాయం పంపిణీ జూన్ 26వ తేదీన మొదలైంది. తొలిరోజు ఎకరం విస్తీర్ణం గల రైతులకు సాయం విడుదల కాగా.. తర్వాత వరుసగా మిగిలిన ఎకరాలకు నిధులు విడుదల చేశారు. తెలంగాణలో రైతులను రాజును చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ కు ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. వారికి ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధును పూర్తి చేశారని.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియ సైతం త్వరలోనే పూర్తి కానుందని స్పష్టం చేశారు. 11వ విడత రైతుబంధు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. 


గతం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడింది. 10వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేశారు. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. మొదట ఎకరం భూమి లోపు ఉన్న వారికి, ఆ తరువాత 2 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా 11వ విడత పూర్తయ్యేసరికి అర్హులైన రైతలన్నల అందరికీ పంట నగదు సాయాన్ని అందజేశారు.










27వ తేదీ నుంచి సెప్టెంబర్ 3 వరకు అమెరికాలో పర్యటన


ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు అమెరికాలో మంత్రి నిరంజన్ రడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం అమెరికాలో పర్యటించనుంది. ప్రపంచ వ్యవసాయ ప్రగతి ప్రదర్శనకు హాజరు కాకపోవడంతో ఆ దేశంలోని సాగు విధానాలను అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనకు అనుమతిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇల్లినాయి రాష్ట్రంలో వ్యవసాయ సదస్సు జరగనుంది. అనంతరం మంత్రి, అధికారుల బృందం అమెరికాలోని వ్యవసాయిక రాష్ట్రాలైన లోవా, నార్త్ కరోలినాలతో పాటు వాషింగ్టన్ లోనూ పర్యటిస్తోంది. అమెరికా వ్యవసాయశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులతో భేటీ అవుతుంది.