PM Kisan Mobile App: వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా రైతుల కోసం కేంద్ర సర్కారు 2019 లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం - కిసాన్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.6 వేల చొప్పున, మూడు వాయిదాల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీని కోసం కిసాన్ మొబైల్ యాప్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు రైతులు ఇంటి వద్ద కూర్చొని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీతో ఈ ప్రక్రియ సాగుతుంది. ఇందులో పేపర్ వర్క్, మాన్యువల్ అప్లికేషన్లు లేకుండా చాలా సులభతరంగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. ఈ యాప్ తో ఉన్న ప్రయోజనాలను కూడా కేంద్ర మంత్రి వివరించారు.


ఈ యాప్ ద్వారా ఇంటిగ్రేటెడ్ e-know యువర్ కస్టమర్(eKYC) ధ్రువీకరణ ఫీచర్ తో ఈ యాప్ ను తయారు చేసినట్లు కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. అలాగే ఈ యాప్ ద్వారా ఇతర వివరాలు కూడా తెలుసుకునే వీలు ఉంటుంది. లావాదేవీల స్థితి, భూమి రికార్డులను లింక్ చేసుకునే వెసులుబాటు( పీఎం కిసాన్ ద్వారా ప్రయోజనం పొందాలంటే ఇది కచ్చితంగా చేసుకోవాలి), ఏయే తేదీల్లో డబ్బు జమ అవుతుంది సహా కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రైతులు ఇళ్లలో కూర్చొని పీఎం కిసాన్ కోసం ఎవరికి వారు స్వయంగా దరఖాస్తు చేసుకోచ్చని నరేంద్ర తోమర్ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ యాప్ ను ఉపయోగిస్తారని చెప్పారు. ఒక్కో అధికారి 500 మంది వరకు రైతులను ఈ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసే వీలు ఉంటుందన్నారు. 


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారత్ కు తిరిగి రానున్నారు. వచ్చే సోమవారం  ప్రధాని మోదీ కర్ణాటకలోని బెలగావిలో వ్యవసాయదారులకు పీఎం కిసాన్ ఆదాయ బదిలీ పథకం కింద దాదాపు 80 కోట్ల మంది రైతులకు రూ. 16,800 కోట్ల విలువైన నగదును పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 


Also Read: ISRO News: ఇస్రో - నాసా జాయింట్ మిషన్, మోదీ పర్యటనలో కీలక ముందడుగు - పూర్తి వివరాలివీ


ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి?


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి చిన్న మరియు మధ్య తరగతి రైతులకు ఏటా రూ. 6,000 రూపాయలు ఇస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా ఇస్తున్నారు.  ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద క్రెడిట్ కార్డునూ ఇస్తున్నారు. దీని ద్వారా సులభంగా కేసీసీను తయారుచేసుకోవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు 4 శాతం వడ్డీపై రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు రుణం లభిస్తుంది.