ఆమెరికాలో ఇటీవల జరిగిన మిస్ ఇండియా యుఎస్‌ఏ పోటీలో సౌందర్యంతోనే కాకుండా ప్రతిభతోనూ మన అమ్మాయిలు ఆకట్టుకున్నారు. ఈ కిరీటాన్ని గెలుచుకున్న వైదేహీ డోంగ్రే.. కథక్ డాన్సర్,పెద్ద సంస్థకు బిజినెస్ డెవలపర్ కూడా. ఫస్ట్ రన్నర్ అప్‌గా నిలిచిన అర్షి లలాని బ్రైన్ ట్యూమర్‌తో పోరాడుతూ ఆ టైటిల్ సాధించింది. అంతేకాదు, ఆ టైటిల్‌కు చేరిన మొదటి అమెరికన్ ఇండియన్ ముస్లిం కూడా. ఒకరు మిషిగన్ నుంచి ఒకరు జార్జియా నుంచి ఈ టైటిల్స్ సాధించారు.
న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ మొన్నటి వారాంతంలో భారతీయ అమెరికన్ కుటుంబాలతో కళకళలాడింది. అందుకు కారణం అక్కడ 'మిస్ ఇండియా యు.ఎస్.ఏ' అందాల పోటీ జరుగుతూ ఉండటమే. దాంతో పాటు 'మిసెస్ ఇండియా యు.ఎస్.ఏ', 'టీన్ ఇండియా యు.ఎస్.ఏ' పోటీలు కూడా జరిగాయి. గత 40 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ వేడుకలో 2020–21 సంవత్సరానికిగాను మిషిగన్ రాష్ట్రానికి చెందిన వైదేహి డోంగ్రే విజేతగా నిలిచింది. జార్జియాకు చెందిన అర్షి లలాని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఇద్దరూ తమ తమ ప్రత్యేకతలతో ఈ టైటిల్స్‌ను సాధించారు.
ముంబయి అమ్మాయి..
అమెరికాలోని 30 రాష్ట్రాల నుంచి 61 మంది భారతీయ యువతులు ఈ టైటిల్ కోసం పోటీ పడితే 25 ఏళ్ల వైదేహి డోంగ్రే గెలిచింది. మిషిగన్ యూనివర్సిటీలో చదువుకున్న వైదేహి ప్రస్తుతం ఆర్థిక రంగంలో పని చేస్తోంది.
కథక్ డాన్సర్ కావడం వల్ల అద్భుతమైన కథక్ నృత్యం ప్రదర్శించి 'మిస్ టాలెంటెడ్' అవార్డు కూడా గెలుచుకుంది.
ఈ విద్యలే కాకుండా ఆమెకు పాడటం కూడా తెలుసు. చాలా హిందీ సినిమా పాటలు పాడుతూ సరదాగా వీడియోలు చేస్తుంటుంది. మిస్ యు.ఎస్.ఏ ఇండియా టైటిల్ ఆమె తన తల్లికి అంకితం ఇచ్చింది.