వాస్తు పరంగా ఇంటి ద్వారం ఏ వైపు ఎలాంటి ఫలితం...



ఇంటి సింహ ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించొచ్చు. దీన్నే షోడశ గృహనిర్మాణం అంటారు.



ధృవగృహం: నాలుగు దిక్కులా గోడలు నిర్మించి..పై వైపు ద్వారం నిర్మాణం చేయడాన్ని ధృవ గృహం అంటారు. అంటే నేలమాళిగకు ఉండేద్వారం అన్నమాట.



ధాన్య గృహం: తూర్పు వైపు మాత్రమే సింహద్వారం కలిగిన గృహాన్ని ధాన్య గృహం అంటారు. ఇలాంటి ఇల్లు శత్రునాశనం చేసి విజయాన్నందిస్తుంది.



జయగృహం: దక్షిణం వైపు మాత్రమే సింహద్వారం ఉంటే జయగృహం అంటారు. ఇది కూడా శత్రువలపై పై చేయి సాధించేలా చేస్తుంది. వ్యాపారాలకు ఈ ద్వారం అత్యంత అనుకూలం.



కాంత గృహం: తూర్పు, పశ్చిమాన ద్వారాలు ఉన్న ఇంటిని కాంత గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో ధనలాభం, వంశాభివృద్ధి, వ్యాపారాభివృద్ది, ఆరోగ్యం, సంతోషం కొలువై ఉంటాయంటారు వాస్తు పండితులు.



మనోరమ గృహం: దక్షిణం, పడమర వైపు ద్వారాలుండే ఇంటిని మనోరమ గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో మానసిక ఆనందం, సిరి సంపదలు, వంశాభివృద్ధి ఉంటుంది.



ధన గృహం: తూర్పు, ఉత్తర, దక్షిణ ద్వారాలు కలిగిన ఇంటిని ధన గృహం అంటారు. ఇలా ఉంటే అష్ట ఐశ్వర్యాలు, పశు సంపద, యశోకీర్తి, కుటుంబ వృద్ధి, రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది.



విపుల గృహం: ఉత్తరం, పడమర, దక్షిణ దిశల్లో ద్వారాలుంటే విపుల గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో ఉంటే సంఘంలో గౌరవం పెరుగుతుంది, దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందుతారు.



జయగృహం: నాలుగు వైపులా ద్వారాలు ఉన్న ఇంటిని జయ గృహం అంటారు. వ్యవసాయ భూమితో పాటూ ధన ధాన్య, పశు సంవృద్ధి ఉంటుంది. ఆర్థికంగా బావుంటుంది.



సుముఖ గృహం: తూర్పు, పడమర, దక్షిణ దిశల్లో ద్వారాలుండే ఇంటిని సుముఖ గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మానాలు అందుకుంటారు. రాజకీయ ఎదుగుదల ఉంటుంది . అయితే 25 ఏళ్ల తర్వాత కొద్దిగా మార్పులు చేయాల్సి ఉంటుంది.



క్షయ గృహం: పడమర, ఉత్తర దిశల్లో ద్వారాలు కలిగిన ఇంట్లో సిరిసంపదలు నశిస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు, వ్యాపారులకు ఈ ద్వారం అస్సలు కలసిరాదు. అనవసర తలనొప్పులు తప్ప ఇంకేమీ మిగలదు.



నంద గృహం: తూర్పు, దక్షిణ దిశల్లో రెండువైపులా సింహద్వారాలు ఉన్న ఇంటిని నంద గృహం అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో మహిళలు నిత్యం అనారోగ్యంతో బాధపడతారు. శారీరక సుఖం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు



ఖరగృహం: పశ్చిమం వైపు సింహం ద్వారం ఉండే ఉంట్లో ఆర్థిక ఇబ్బందులు, బాధ తప్పదు.



దుర్ముఖ గృహం: ఉత్తర దిశలో మాత్రమే ద్వారం ఉండే ఇల్లు కొందరికి మాత్రమే కలిసొస్తుంది. ఇలాంటి ఇంట్లో నిత్యం గొడవలు, సోదరుల మధ్య బంధం తెగిపోవడం జరుగుతాయి. ఆర్థికంగా ఎదుగుదల కనిపించినా రానురానూ తగ్గిపోతుంది.



క్రూర గృహం: తూర్పు, ఉత్తర దిశల్లో ద్వారం ఉన్న ఇంటిని క్రూర గృహం అంటారు. ఇలాంటి ఇంట్లో అభివృద్ధి చెందుతారు కానీ... దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అపమృత్యు దోషం కూడా వెంటాడుతుందట.



అక్రంద గృహం: తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో ద్వారం కలిగిన ఇంట్లో శోకం, నిత్య రోగాలు, బంధువులతో వివాదాలు వెంటాడుతాయి.



సూపక్ష శాల: ఉత్తరం, దక్షిణాల్లో ద్వారాలు ఉన్న ఇంటిని సూపక్ష శాల అని పిలుస్తారు. ఇలాంటి ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది. వంద సంవత్సరాల ఆయుష్షు కలిగిన గృహం. కానీ శత్రు భయం ఉంటుంది.



మీ నక్షత్రాన్ని బట్టి కూడా మీకు ఏ వైపు సింహద్వారం ఉంటే మంచిదన్నది వాస్తు నిపుణులును సంప్రదించగలరు.