కాశీ యాత్ర: వారణాసి వెళుతున్నారా - మరి అక్కడ ఏం వదిలేయాలో తెలుసా!



కాశీకి వెళ్లినవారంతా అక్కడ కాయ, ఫలం వదిలేయాలని చెబుతారు. అందరూ చేసేది కూడా అదే. ఎందుకు వదిలేయాలి, అసలు వదిలేయాల్సినవి ఏంటి



‘నగాయత్య్రా సమో మంత్రమ్‌ న కాశీ సదృశీ పురీ,
నవిశ్వేశ సమంలింగం సత్యం సత్యం పునః పునః’
ఇది కాశీ మహాత్మ్యంలోని మొదటి శ్లోకం



గాయత్రీ మంత్రంతో సరితూగే మంత్రం, కాశీపురానికి సమానమైన పుణ్య స్థలం, ఇక్కడి విశ్వేశ్వర లింగానికి సాటివచ్చే శివస్వరూపం ఏదీ లేదు అని అర్థం. కాశీని విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు కాబట్టి దీనికి అవిముక్త క్షేత్రం అని పేరొచ్చింది.



ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వర దర్శనం ఇతర లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. ఇక్కడ గంగానదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని విశ్వాసం



ఏ ఆలయానికి వెళ్లినా, ఎక్కడ స్వామిని దర్శించుకున్నా కలకాలం జీవించాలని కోరుకుంటారు. కానీ జీవన్ముక్తి పొందాలని తపించే ఏకైక క్షేత్రం కాశీ. సాక్షాత్తు పరమశివుడు కొలువైన దివ్యస్థలం



ఇక కాశీకి వెళ్తే ఏ కాయో..పండో వదిలేయాలని అంటారు. వాస్తవానికి కాశీలో కాయో-పండో వదిలేయాలని ఏ శాస్త్రము చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో అలా మార్చేశారు.



శాస్త్రం ఏం చెప్పిందంటే…కాశీక్షేత్రం వెళ్లి గంగలో స్నానం చేసిన వారు కాయాపేక్ష, ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాలని అంతరార్థం.



ఇక్కడ కాయాపేక్ష, ఫలాపేక్ష అంటే…కాయం అంటే శరీరం…శరీరంపై ఆపేక్షని, ఫలం అంటే కర్మఫలం…కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింతన కలిగి ఉండాలని అర్థం. కాలక్రమేణా అది కాయ, పండుగా మారిపోయింది.



కాశీకి వెళ్లి ఇష్టమైన కాయగూరలు, పండ్లు, ఆకులు గంగలో మునకేశాక వదిలేస్తే అందులో నిజమైన పుణ్యం దక్కదు.
శాస్త్రం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం, సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది.



ప్రతి మనిషీ జీవిత చరమాంకంలో బంధాలు, రాగద్వేషాలు, తోటివారితో వివాదాలు వదిలిపెట్టి కాశీ యాత్ర చేయడజం వెనుక అసలు అంతరార్థం ఇదే. విశ్వనాథుడి దర్శానంతరం మృత్యువు దరిచేరేవరకూ మనసును ఆ పరమశివుడిపై లగ్నం చేయాలి



ఓం నమః శివాయ


Thanks for Reading. UP NEXT

కార్తీకమాసం ఆఖరి రోజు పోలిస్వర్గం కథ ఎందుకు చెప్పుకుంటారంటే!

View next story