శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది. అన్ని గ్యాలరీల వద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని తెలియజెబుతున్నాడు. అందుకే గరుడ సేవకు ఇంత ప్రాధాన్యం దక్కింది. బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. అనంతరం రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజవాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.