ఈ లోపాలు కనిపిస్తే జింక్ లోపించినట్టే, జాగ్రత్త మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.కొన్ని లక్షణాల ద్వారా జింక్ లోపాన్ని కనిపెట్టవచ్చు. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. ఆకలి తక్కువ వేస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఈ పోషకలోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మారుతుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి.