సంక్రాంతి సందర్భంగా చేయాల్సిన మంచి పనులివే...



నదీస్నానం
మకర సంక్రాంతి రోజున గలగలపారే నీటిలో స్నానం చేయడం చాలామంచిదంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో కానీ, తమకు సమీపంలో ఉన్న నదిలో కానీ స్నానం చేస్తారు. అవకాశం లేనివారు గతంలో నదీస్నానానికి వెళ్లినప్పుడు బాటిల్స్ లో తీసుకొచ్చిన నీటిని ట్యాంక్ లో మిక్స్ చేసి చేసినా కొంత ఫలితం ఉంటుందని చెబుతారు.



సూర్యుడికి నమస్కారం చేయండి
సంక్రాంతి రోజైనా సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం( దోసిలితో నీరు) అర్పించండి. మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఇప్పటి వరకూ జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం.



దానం చేయండి..
మకర సంక్రాంతి రోజున దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పేదలకు వస్త్రదానం చేయండి, ఇంటింటా సందడి చేసే డూడూ బసవన్నకి ఆహారం అందించండి. పల్లెటూర్లలో ఉండేవారు మీకు సమీపంలో ఉన్న పశువుల పాకకు వెళ్లి వాటికి ఆహారం అందించి నమస్కరించి రండి.



పిండి వంటలు పంచుకోండి
సంక్రాంతికి దాదాపు పది రోజుల ముందు నుంచీ పిండివంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి. ఏ ఇంట చూసినా పిండి వంటలు తయారీనే. చుట్టుపక్కల వారితో కలసి పిండివంటలు చేసుకోండి. అంతా పంచుకుని స్నేహభావాన్ని చాటుకోండి.



కొందరు పండుగ రోజు నువ్వులు తినడం ఏంటనే సెంటిమెంట్ తో ఉంటారు కానీ చాలా ప్రాంతాల్లో నువ్వులతో చేసిన వంటలను సంక్రాంతికి ఆస్వాదిస్తారు. లడ్డు, ఖిచ్డి తయారు చేసి పంపిణీ చేస్తారు.



అన్నమో రామచంద్రా అనేవారి ఆకలి తీర్చండి
ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి.



దేవుడు ఎక్కడో ఉండడు..మనం చేసే సాయం లోనూ, ఆకలితో ఉండేవారికి పెట్టే అన్నంలోనే ఉంటాడంటారు కదా..అందుకే పండుగ రోజు మనం పది రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు.. పస్తులున్న వారి కడుపునింపండి...