తెలుగు సినిమా సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం వేకువ జామున కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ 340కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. సినిమాల్లోకి వచ్చాక ఘట్టమనేని కృష్ణగా పేరు మార్చుకున్నారు. కృష్ణ 1942 మే 31 న ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు జన్మించారు. ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసారు కృష్ణ. అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. తేనె మనసులు, గూఢచారి 116, అల్లూరి సీతారామ రాజు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కృష్ణ 1969లో 19 సినిమాల్లో నటించి రికార్డు సష్టించారు. పద్మాలయా పిక్చర్స్ నిర్మాణ సంస్థను 1970లో ప్రారంభించారు. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు చిత్రాలను సొంత బ్యానరుపై నిర్మించారు. జాతీయ పురస్కారం , పద్మభూషణ్ లాంటి పురస్కారాలు అందుకున్నారు. కృష్ణ 1989లో కాంగ్రెస్ నుంచి ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించారు. 1991లో ఏలూరులో ఓటమి చెందడం వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.