కలబంద మొక్కకు నీరు నిల్వ ఉండకూడదు. అందుకే కింద డ్రైనేజ్ హోల్స్ ఉన్న మట్టి లేదా టెర్రకోట కుండీని ఎంచుకోవాలి. దీంతో అదనపు నీరు బయటకు వెళ్లిపోతుంది.
కలబందకు ఇసుక కలిసిన, నీరు నిల్వ ఉండని మట్టి అనుకూలంగా ఉంటుంది. సక్కులెంట్స్ లేదా కాక్టస్ మొక్కలకు ఉపయోగించే పాటింగ్ మిక్స్ కూడా వాడవచ్చు.
కలబంద మొక్క బాగా పెరగాలంటే రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల వరకు పరోక్ష సూర్యకాంతి అవసరం. బాల్కనీ, కిటికీ దగ్గర ఉంచితే మంచి పెరుగుదల ఉంటుంది.
కలబందకు ప్రతిరోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. మట్టి పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
వర్షపు నీరు కుండీలో నిల్వ ఉంటే మొక్క దెబ్బతింటుంది. కాబట్టి వర్షాకాలంలో కుండీని నీరు నేరుగా పడని ప్రదేశంలో ఉంచడం మంచిది.
మొక్కలో ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను క్రమం తప్పకుండా తొలగించాలి. దీంతో మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
కలబందకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి సేంద్రీయ ఎరువు లేదా కంపోస్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది.
పెద్ద కలబంద మొక్క చుట్టూ చిన్న మొక్కలు (పప్స్) వస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా వేరు చేసి మరో కుండీలో నాటితే కొత్త మొక్కలు సులభంగా పెరుగుతాయి.
అధిక చలి కలబంద మొక్కకు హానికరం. ఉష్ణోగ్రత చాలా తగ్గినప్పుడు మొక్కను ఇంట్లో లేదా రక్షణ ఉన్న ప్రదేశంలో ఉంచాలి.
అవసరమైనప్పుడే బయటి భాగంలో ఉన్న పెద్ద ఆకులను కత్తిరించాలి. ఒకేసారి ఎక్కువ ఆకులను తీసేస్తే మొక్క పెరుగుదల మందగించే అవకాశం ఉంటుంది.