రుక్మిణి తయారుచేయించిన కృష్ణుడి విగ్రహం చూశారా!



ఉడిపిలో శ్రీకృష్ణుడు బాలుడిగా కొలువై ఉంటాడు. దీనివెనుక ఆసక్తికర కథనం ఉందని మీకు తెలుసా...



ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరంలో తపోదీక్షలో ఉండగా అటుగా వస్తున్న ఓ నావ అలలకు పైపైకి లేచి ప్రమాదంలో చిక్కుకుంది.



మధ్వాచార్యులు తన కండువా విసిరి ఆ నావను ఒడ్డుకి చేర్చారు. నావలోని వారంతా కిందకు దిగి స్వామివారికి నమస్కరించి తమకు కాపాడినందుకు కృతజ్ఞతగా నావలో ఏదైనా విలువైన వస్తువుని తీసుకోమని కోరారు.



చిరునవ్వు నవ్విన మధ్వాచార్యులు పడవలో ఉన్న గోపీచందనపు గడ్డలు ఇవ్వమని అడిగారు. ఆ మాటవిని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకూ పనికిరాని మట్టిగడ్డలు అడుగుతున్నారెందుకని ప్రశ్నించారు.



వాటిని చేతిలోకి తీసుకున్న మధ్వాచార్యులు చప్పున నీటిలో ముంచారు. ఆ మట్టంతా కరిగి లోపల నుంచి శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలు బయటపడ్డాయి.



ఒకసారి దేవకీదేవి కృష్ణునితో నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగించినట్టు తనకూ కలిగేలా చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారి అన్న బలరాముడితో కలసి ఆడుకున్నాడు.



బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకితో పాటూ రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది. చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణి దేవి ...విశ్వకర్మను పిలిచి విగ్రహాలు చేయమని కోరింది.



అలా తయారు చేయించిన విగ్రహాలు కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో కలిసినప్పుడు నీటిలో కలసిపోయాయి. ఆ తర్వాత ఇలా మధ్వాచార్యుల చేతికి వచ్చాయి. ప్రస్తుతం ఉడిపి పూజలందుకుంటున్నది ఈ విగ్రహమే..



అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం…అభిషేకించిన తరువాత 30 మంది కలిసినా కనీసం కదపలేకపోయారు. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది.



విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ, సామాన్య శకం 1236లో ఉడిపిలో విగ్రహాలు ప్రతిష్ఠించారు.