కార్తీక సోమవారం ఉపవాసం ఉంటున్నారా -ఈ విషయాలు తెలుసా!



కార్తీక మహత్యం గురించి జనకమహారాజుకి వివరించిన వశిష్ట మహర్షి...కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా స్నాన, జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారని చెప్పారు.



సోమవార వ్రతవిధి ఆరురకాలు
1. ఉపవాసము
2. ఏకభక్తము
3. నక్తము
4. అయాచితము
5. స్నానము
6. తిలదానము



1. ఉపవాసము
కార్తీకమాసంలో సోమవారం రోజు ఉపవాసం ఉంటే అత్యుత్తమ ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం సహకరించినవారు, శక్తి ఉన్నవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడుకి యధాశక్తి పూజచేసి..నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి.



2. ఏకభక్తము
ఆరోగ్యం సహకరించకపోయినా కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్లు ఏక భుక్తము పాటించవచ్చు. ఉదయాన్నే స్నానం , పూజ పూర్తిచేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి వేళ భోజనానికి బదులు తీర్థం తీసుకోవచ్చు



3. నక్తము
సాధారణంగా కార్తీకమాసంలో అందరూ ఫాలో అయ్యేది నక్తమే. అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం, పూజ పూర్తిచేస్తుకుని నక్షత్ర దర్శనం అనంతరం భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.



4. అయాచితము
తమకి తాముగా వండుకుని తినడం కాకుండా..ఎవరైనా భోజనానికి పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము అంటారు. . రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఇలాంటి భోజనం చేస్తే పెట్టిన వారికి కూడా ఉత్తమగతులు లభిస్తాయని పురాణోక్తి.



5. స్నానము
ఉపవాసం, ఏకభుక్తం, నక్తము, ఆయాచితము ఇవన్నీ పాటించలేనివారు కనీసం సమంత్రక స్నానం ఆచరించి, యధాశక్తి దేవుడికి నమస్కరించుకున్నా చాలు.



6. తిలదానము
కనీసం మంత్ర జపవిధులు కూడా మాకు తెలియదు కానీ భక్తి ఉంది ఏం చేయాలి అంటారా.. స్నానమాచరించి కార్తీక సోమవారం రోజు నువ్వులు దానం చేసినా సరిపోతుందంటారు పండితులు.



ఆరు పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం ఆచరించినట్టే అవుతుందని వశిష్ట మహర్షి జనకమహారాజుకి వివరించారు



కార్తీక మాసంలో వచ్చే ప్రతిసోమవారం పగలంతా ఉపవసరించి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసేవారు శివసాయుజ్యాన్ని పొందుతారు.



Images Credit: Pinterest