‘ఓ శమీ వృక్షమా! పాపాలను పోగొట్టి, శత్రువులను పరాజయం పాల్చేయడం నీ విశిష్టత. అర్జునుడు ధనుస్సు దాచింది నీ దగ్గరే!
రాముడికి ప్రియం చేకూర్చిందీ నువ్వే. శ్రీరాముడు పూజించినట్లే నేనూ నిన్ను పూజిస్తున్నాను. ఎలాంటి విఘ్నాలూ లేకుండా నా విజయ యాత్రను సుఖమయం చెయ్యవలసిందిగా ప్రార్థన.’
పాపాలను నాశనం చేసే మహిమ, శత్రువులను నాశనం చేసే శక్తి శమీ వృక్షానికి ఉంది. రావణ వధకు ముందు శ్రీరాముడు శమీ పూజ చేశాడని పురాణ కథనాలు ఉన్నాయి.
మహా భారతంలో అజ్ఞాతవాసం చెయ్యబోయే ముందు పాండవులు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద భద్రపరుస్తారు.
అజ్ఞాతవాసానంతరం, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి, తన ధనుస్సయిన గాండీవాన్ని తీసుకుంటాడు.
నవరాత్రులలో తొమ్మిది అవతారాలతో కొలువు తీరుస్తారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే అమ్మ ఒక్కరే.
దుర్గాదేవి! ‘యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా’ అని ‘దేవ్యుపనిషత్తు’లో ఋషి వాక్యం. ఎవరిని మించినది లేదో ఆ శక్తే దుర్గాదేవి.
నవరాత్రుల్లో, విజయ దశమి రోజున దుర్గాస్తోత్రం పఠిస్తే ఆమె ప్రసన్నురాలవుతుందనీ, సకల కోరికలూ ఫలిస్తాయనీ భక్తుల విశ్వాసం