చాణక్య నీతి: ఈ 8 మందిని అవమానిస్తే దేవుడిని తిట్టినట్టే
అర్థశాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడంటే.. ఓవ్యక్తి భౌతిక సంపదద్వారా ఉత్తముడు కాలేడు, ఖ్యాతి పెంచుకోలేడు. ఎన్ని చేతులు తనని ఆశీర్వదించాయన్నదానిపైనే ఆ వ్యక్తి ఔన్నత్యం బయటపడుతుంది.
దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా..ఆ రూపంలో 8 మందిని మీ చుట్టూ పెట్టాడు..వాళ్లని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదన్నాడు చాణక్యుడు.
1. అమ్మ దేవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ తల్లిని పట్టించుకోనివారంతా కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లిరుణం మీరు ఏం ఇచ్చినా తీర్చుకోలేరు..అందుకే అస్సలు అవమానించరాదు..
2. నాన్న బిడ్డ పుట్టకముందునుంచే బాధ్యత కలిగిన వ్యక్తి తండ్రి. తండ్రి లేనిదే మీ పుట్టుక లేదు.. అలాంటి వ్యక్తిని దూషించేవారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని, ఇంత కన్నా పాపం మరొకటి లేదని చెప్పాడు చాణక్యుడు.
3. గురువు తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే. సమాజ ఉద్ధరణకు విద్య ఆయుధం లాంటిది. ఓ వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే అవసరం. మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారిని పొరపాటునైనా దూషిస్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు.
4.మీ శ్రేయోభిలాషి తల్లిదండ్రులే కాదు..మీకు విలువలు నేర్పించే వ్యక్తులు కొందరుంటారు. వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మంచి చెప్పినా చెవికి ఎక్కించుకోకుండా ధిక్కరించడం, వారిని దూషించడం చేస్తే దేవుడిని అవమానించినట్టే.
5. మీకు భోజనం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోందన్నది నిజమే కానీ ఆ డబ్బు అన్ని వేళలా ఆకలి తీర్చలేదు కదా. ఈ సత్యాన్ని ముందు గ్రహించాలన్న చాణక్యుడు..మీకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ దూషించరాదన్నాడు.
6. స్నేహితుడు కష్టకాలంలో వెన్నంటే ఉండే తండ్రిలాంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీకు తెలియకుండా కూడా దూషించకండి అన్నాడు చాణక్యుడు.
7. భార్య తల్లిదండ్రులు చాలామంది మగవారు..తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు కానీ.. భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకనగా చూస్తారు. తల్లిదండ్రుల విలువ తెలిసిన వ్యక్తి, నిజంగా తల్లిదండ్రులను గౌరవించే వారు ఎప్పటికీ ఎవ్వరి తల్లిదండ్రులనూ దూషించలేరన్నాడు చాణక్యుడు.
8.సంరక్షకులు తల్లి, తండ్రి స్థానంలో సంరక్షకులుగా ఉంటారు కొందరు. వాళ్లు కూడా అహర్నిశలు మీ బాగుకోసం పాటుపడుతూ ఉంటారు. వారిపై విధేయత చూపాలి. లేదంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు..