రామాయణంలో రాముడికి మర్యాదా పురుషుడిగా, సకల గుణాభి రాముడిగా ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉందో అంతటి పరాక్రమము, వ్యక్తత్వబలమూ కలిగిన పాత్ర రావణాసురుడిది కూడా. రావణాసురుడు గొప్ప రాజు మాత్రమే కాదు, మంచి శివభక్తుడు, మాతృ వాక్య పరిపాలకుడు. గొప్ప పరాక్రమవంతుడు, కారణ జన్ముడు కూడా.


 భాగవత పురాణం ప్రకారం, ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు అసలు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. అటువంటి మూడు జన్మలలో ఒకటి ఈ రావణాసుర జన్మ కూడా.


బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వ వసు బ్రహ్మనికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరు రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్వ వసు బ్రహ్మకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి, తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్వ వసు బ్రహ్మ మహర్షి తపస్సు చేసుకొంటుండగా ఆయన వద్దకు వెళ్లి, తపోశక్తితో తన కోరిక తెలుసుకోమని అడుగుతుంది. విశ్వ వసు బ్రహ్మ విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కాని ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు.


సర్వగుణ సంపన్నుడు


ఇది రావణ కుటుంబ చరిత్ర. రావణాసురుడి వ్యక్తిత్వంలో స్త్రీలోలత్వం తప్ప.. మిగతా అన్ని విషయాలలో గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడుగా రామాయణం అభివర్ణిస్తుంది. సుందరకాండలో రావణాసురుడిని మొదటిసారి చూసిన హనుమంతుడు ‘‘ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’’ అని అనుకున్నాడు.


మాతృవాక్య పరిపాలకుడు


తల్లి కైకసి ఒకానొక సందర్భంలో సముద్రపు ఒడ్డున ఇసుకతో సైకత లింగం తయారుచేసి ప్రతిష్టించుకొని పూజించే సమయంలో సముద్రంలో అలలు ఎగసి పడి ఆ లింగం సముద్రంలో కలిసి పోయింది. ఆమె పూజ మధ్యలో సైకతలింగం సముద్రం పాలైనపుడు ఆమే రావణుడి దగ్గర తన దు:ఖాన్ని తెలుపుతుంది. తల్లి దు:ఖాన్ని చూడలేక ఆమె పూజ కోసం శివుడి ఆత్మ లింగమే ఆమెకు తెచ్చి ఇస్తానని చెప్పి తప్పస్సుకు పూనుకుంటాడు. గొప్ప శివ భక్తుడిగా అకుంఠిత తపస్సు చేసి, అన్ని అడ్డంకులను అధిగమించి శివుడి ఆత్మ లింగాన్ని సైతం సంపాదిస్తాడు ఒక చిన్న షరతు మీద. ఆ లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లంక చేరే వరకు కింది పెట్టకూడదని నియమం. కానీ దేవతలు కుట్ర చేసి రావణాసురుడి చేత దాన్ని కింద పెట్టించడం వల్ల అది రామేశ్వర క్షేత్రం అయిందని ఒక కథ.


గొప్ప రాజు


సీతను చెరపట్టే లంక వరకు సర్వాంగ శోభితమైన రాజ్యం. బలవంతుడైన రావణుడి పాలనలో సురక్షిత జీవనం గడిపేవారు అక్కడి ప్రజలు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించగలిగే పరాక్రమం రావణుడిది. ముల్లోకల్లో వీరుడిగా ధీరుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన వాడు. మంచి పాలనా దక్షుడు. దూతగా వచ్చిన హనుమంతుడు ప్రాణాలతో తిరిగి వెళ్లగలిగాడంటే అది రావణాసురుడి రాజకీయనిబద్ధత వల్లే అని చెప్పవచ్చు. వేదవేదాంగాలను అవపోశన పట్టిన వేదాంతుడు. జన్మత: బ్రాహ్మడు. రాక్షస స్త్రీ గర్భసంభూతడవడం మూలంగా రాక్షసుడైనాడు. కుబేరుడిని సైతం యుద్ధంలో ఓడించి పుష్పకవిమానాన్ని తన కైవసం చేసుకున్నాడు. 


చిన్న లోపాలే పెద్ద శాపాలు


ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన రావణాసురుడి వ్యక్తిత్వంలో ఉన్న ఒకటి రెండు లోపాలు అతడిని దుష్టుడిగా, రాక్షసుడిగా మిగిల్చాయి.



  • చెప్పుడు మాటలు వినడం అతడి వ్యక్తిత్వంలో ఉన్న మొదటి లోపం. చెల్లి శూర్పనఖ చెప్పిన పితూరీలు విని ముందూ వెనుకలు ఆలోచించకుండా సీతను అపహరించి తనకు, తన రాజ్యానికి చెరుపు చేసుకున్నాడు.

  • అంతకంటే ముందు హరి తపస్సులో ఉన్న యోగిని వేదవతిని మోహించి, చెరబట్ట బోయి ఆమె చావుకి కారణమై శాపగ్రస్తుడయ్యాడు.

  • సీతాపహరణం తర్వాత విభిషణుడు ఎంత నచ్చజెప్ప ప్రయత్నించినా అతడి మాట వినడానికి అహం అడ్డుగా ఉండి తాను చేస్తున్నది తప్పని తెలిసినా ఒప్పుకోక పోవడం వల్ల అహంకారిగా మిగిలిపోయాడు.


రావణాసురిడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎన్ని గొప్ప గుణాలున్నా కూడా వ్యక్తిత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలను సరిచేసుకేలేక పోతే అవి పూర్తి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. గొప్ప రాజుగా, మంచి తండ్రిగా, చెల్లి కి జరిగిన అవమానాన్ని సహించలేని అన్నగా, పరిపాలనా దక్షుడుగా, గొప్ప భక్తుడిగా ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ యుగాలుగా చెడ్డవాడిగా మిగిలిపోయాడు.


Also Read: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!


Also Read: మహిషాసుర మర్ధిని స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసా!