Money Transfers To Stranger: ప్రతి వ్యక్తి జీవితంలో తొలి సంపాదన ఓ మధురానుభూతి. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఆశయాల తర్వాత వచ్చిన తొలి ఉద్యోగంలో వచ్చే తొలి సంపాదన నిజంగా చాలా చాలా ప్రత్యేకమైనది. ఆ సంపాదన చాలా తక్కువే అయినా.. దాని విలువ మాత్రం విలువ కట్టలేనిది. జీతం అంటే, జీవితం అంటే విలువ అప్పుడే తెలిసి వస్తుంది. రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుస్తుంది. రూపాయి విలువ ఎంత గొప్పదో అర్థం చేసుకో గలుగుతారు. చేసే పనిని బట్టీ, పడిన కష్టాన్ని బట్టీ, కన్న కలలను బట్టి ఆ రూపాయి విలువ ఎలా మారుతుందో, ఎంత గొప్పగా ఉంటుందో తెలిసి వస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో తొలి జీతం చాలా చాలా ప్రత్యేకం.
తొలి సంపాదన ప్రత్యేకం..
తొలి సారిగా ఎంతో కష్టపడి, ఎంతో పని చేసి అందుకునే ఆ జీతాన్ని తమకు తాముగా ఖర్చు చేసే వారి కంటే వాటిని తల్లిదండ్రులకు బహుమతులు కొనివ్వడానికో, వారికే ఇచ్చి, ఇదీ నా సంపాదన అని చెప్పాలనో ఉంటుంది చాలా మందికి. మరి కొందరైతే.. తల్లి దండ్రులు పడుతున్న కష్టాలకు తన వంతుగా తొలి జీతాన్ని అందిస్తారు. కష్టాల కడలి నుంచి బయట పడేందుకు అదో మొదటి మెట్టుగా భావిస్తారు.
తల్లికి డబ్బు పంపిన ఫహాదా..
అలాగే అనుకుంది ఓ మహిళ. తన తొలి జీతాన్ని అందుకున్న తర్వాత దానిని తన తల్లికి పంపించింది. కష్టపడి పని చేసి సంపాదించిన ఆ జీతాన్ని తల్లికి ఇచ్చి తనను సంతోష పెట్టాలని కలలు కన్నది. తాను తల్లికి డబ్బులు పంపించిన విషయాన్ని తెలియజేసింది. అప్పుడు కానీ తన జీతం తల్లికి పంపించలేదని మరో అపరిచిత వ్యక్తికి పంపించానని గుర్తించలేక పోయింది.
అసలేం జరిగిందంటే..?
ఆ మహిళ పేరు ఫహాదా బిస్తారీ. ఉండేది మలేషియాలో. టిక్ టాక్ లో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో తన బాధనంతా వెళ్లగక్కింది. కన్నీరు పెట్టుకుంటూ తను చేసిన పొరపాటు.. తన కలలను కల్లోలం చేసిందని కన్నీరు మున్నీరు అయింది. ఫహాదా బిస్తారీ కొన్ని రోజుల క్రితం ఓ ఉద్యోగంలో చేరింది. నెల అయ్యాక తనకు జీతం వచ్చింది. కొన్ని రోజులే ఉద్యోగం చేయడంతో ఆ రోజులకు మాత్రమే జీతం ఇచ్చారు. కొంత మొత్తమే అయినా అది తనకు ఎంతో ప్రత్యేకం. అది తన తొలి జీతం. ఎంతో కలల తర్వాత వచ్చిన తొలి సంపాదన. ఆ డబ్బును తనతో ఉంచుకోవాలని అనుకోలేదు ఫహాదా బిస్తారీ. ఆ డబ్బులు తన తల్లికి పంపించాలనుకుంది. తన తల్లి నంబరుకు పంపించింది. తన తొలి జీతాన్ని పంపించినట్లు తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అందుకు సంబంధించిన వివరాలు పంపించింది. వాటిని చూసిన ఫహాదా బిస్తారీ తల్లి.. జరిగిన పొరపాటు గుర్తించింది. డబ్బు పంపించే హడివుడిలో ఫహాదా చిన్న పొరపాటు చేసింది. దాని వల్ల ఆ డబ్బు అపరిచితుడికి వెళ్లాయి.
తన డబ్బు తనకు ఇవ్వాలంటూ ఆ వ్యక్తికి ఫోన్ చేసి అడిగింది. కానీ ఆ వ్యక్తి డబ్బు పంపించేందుకు ససేమిరా అన్నాడు. డొనేషన్ అనుకోమని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తనకు ఎదురైన ఈ సంఘటన గురించి బిస్తారీ టిక్ టాక్ లో చెప్పుకుని కన్నీరు మున్నీరు అయింది. అయితే ఇక్కడ మరో ట్విస్టు ఉంది. మరుసటి రోజు ఆ అపరిచిత వ్యక్తి ఆ డబ్బును తిరిగి ఫహాదాకు పంపించాడు.