Skin Wrinkle in Water: నీటిలో ఎక్కువ సేపు ఉన్న వారు, వాటర్ గేమ్స్ ఆడిన వారి కాళ్లు, చేతుల వేళ్లపై చర్మం ముడతలు పడినట్లుగా కనిపిస్తుంది. ఇది చాలా మందికి అనుభవమే. అయితే అలా ఎందుకు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. నీటిలో ఉంటే చర్మం ఎందుకు ముడతలు పడుతుంది.. దీని వెనక అసలు కారణం ఏంటి.. కేవలం చేతి, కాలి వేళ్ల చర్మమే ఇలా ఎందుకు అవుతుంది. మిగతా చర్మం ఎందుకు ముడతలు పడదు.. సైన్స్ ఏం చెబుతుందో ఓసారి తెలుసుకుందామా..?


నీటిలో చర్మం ఎందుకు ముడతలు పడుతుంది?


మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. శరీరానికి చర్మమే రక్షణ కల్పిస్తుంది. లోపల ఉన్న అవయవాలను ఎప్పుడూ కాపాడుతుంది. కండరాలు, ఎముకలకు రక్షణ కల్పిస్తుంది. లోపల ఉన్న శారీరక వ్యవస్థ సక్రమంగా సాగేలా, రక్తం ప్రవహించేలా, అవయవాలన్నీ తమ తమ పనులు నిర్వర్తించేలా రక్షణగా నిలుస్తుంది చర్మం. చర్మానికి దెబ్బ తగిలితే తనకు తాను మాన్చుకుంటుంది. కణాలను ఉత్పత్తి చేసి గాయాల వల్ల ఊడిపోయిన చర్మాన్ని తిరిగి నిర్మించుకుంటుంది. 


మానవ చర్మంపై పైభాగంలో సెబమ్ అనే ఓ రకమైన నూనె ఉంటుంది. ఇది చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుతుంది. ఈ నూనె బయటి వాతావరణంలోని దుమ్ము ధూళి, బ్యాక్టీరియా నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. స్నానం చేసేటప్పుడు చర్మంపై నీరు పోసినప్పుడు అవి కిందరు జారిపోవడానికి ఈ నూనెనే కారణం. చర్మంపై నీరు పేరుకుపోకపోవడానికి కారణం కూడా ఈ సెబమే. ఎక్కువ సేపు చర్మం నీటిలో ఉంచడం వల్ల ఈ నూనె క్షీణిస్తుంది. దాంతో నీరు చర్మంలోకి ఇంకుతుంది. ఈ ప్రక్రియను ఆస్మాసిస్ అంటారు. 


రెండో సిద్ధాంతం ప్రకారం.. నీరు చర్మంలోని రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. ఎందుకంటే నీరు చల్లటి ఉద్దీపన. ఈ చల్లటి ఉద్దీపన వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్త నాళాలు అలా కుంచించుకుపోయినప్పుడు ఇది చర్మానికి రక్త ప్రసరణను తగ్గిస్తుంది. అలా కావడం వల్ల చర్మం ముడతలు పడుతుంది.


కేవలం వేళ్లు మాత్రమే ముడతలు పడతాయెందుకు?


నీటిలో ఎక్కువ సేపు ఉంటే మిగతా చర్మం ఎప్పట్లాగే సాధారణంగా ఉంటుంది. కానీ కాళ్లు, చేతుల వేళ్లు మాత్రమే ముడతలు పడతాయి. వాస్తవానికి కెరాటిన్ అనే ప్రోటీన్ పదార్థం చేతులు, కాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రోటీన్ నీటిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది. కెరాటిన్ చేతులు, కాళ్లలోనే ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి చర్మం మాత్రమే ముడతలు పడుతుంది. 


* నీటిలో చర్మం ముడతలు పడటానికి పట్టే సమయం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని నిమిషాల తర్వాత ముడతలు పడడం ప్రారంభించవచ్చు. మరికొందరికి అసలు ముడతలే పడకపోవచ్చు.
* నీటి ఉష్ణోగ్రత కూడా చర్మం ముడతలు పడటంపై ప్రభావితం చూపిస్తుంది. చల్లటి నీటి కంటే వేడి నీళ్ల వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది.
* చర్మం నీటిలో ముడతలు పడకుండా నిరోధించడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. 
* నీటిలో దిగే ముందు చర్మానికి మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోవాలి.
* నీటిలో ఉన్నప్పుడు గ్లౌజ్ లు మరియు సాక్స్ ధరించడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.