Kuppam People dies with electrocuted while attends Funeral: చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలోని తంబిగానిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దహన సంస్కారాలకు వెళ్లిన వారు విద్యుత్ ఘాతుకానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ తీగలు ఒక్కసారిగా వీరి మీద పడటంతో ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మహిళ నిన్న రాత్రి చనిపోయింది. నిన్న మృతి చెందిన రాణెమ్మ అనే మహిళ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో తంబిగానిపల్లి ఎస్సీ కాలనీలో రాణెమ్మ పాడే మోస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తగిలాయి. పాడే మోస్తున్న మునెప్ప, తిరుపతిరావు, రవీంద్రలకు విద్యుత్ షాక్ తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు.
కుటుంబసభ్యులు, బంధువులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పరీక్సించిన వైద్యులు ఆ ముగ్గురు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మాట్లాడుతూ.. రాణెమ్మ అంత్యక్రియల కోసం ఇనుముతో పాడె తయారు చేశారు. ఆమె పాడె మోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. అసలే ఇనుము కావడంతో ఒక్కసారిగా కరెంట్ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
లైన్ మెన్, అధికారుల నిర్లక్ష్యమే కారణం..!
బాధితుల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. లైన్ మెన్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ మెన్ అధికారులకు సమాచారం అందించి వైర్లను పైకి కట్టించలేదని, దాని వల్ల ప్రాణ నష్టం జరిగిందన్నారు. చిన్న వయసు ఉన్న వాళ్లు, చిన్న పాప ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
‘విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ముగ్గురి ప్రాణాలు పోయాయి. అధికారులకు గతంలోనే సమాచారం అందించినా పట్టించుకోని కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంగానే దుర్ఘటన జరిగింది. సత్వరమే స్పందించి తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమం చేసేందుకైనా వెనకాడమని’ బాధిత కుటుంబాలకు చెందిన ఒకరు అన్నారు.