రైలు పట్టాలు దాటేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. యముడికి కాల్ చేసి పిలిచినట్లే. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి దాదాపు అదే చేశాడు. లక్కీగా మొబైల్ సిగ్నల్ అందకపోవడం వల్ల యముడికి కాల్ వెళ్లలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. ఆ రైలు నేరుగా అతడి పై నుంచి వెళ్లేది. అసలు ఏం జరిగిందో చూస్తే తప్పకుండా మీ కాళ్లు, చేతులు వణికిపోతాయి. 


ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఈ ప్రమాద వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. రైల్వే గేటు వేసినా లెక్క చేయకుండా ఓ వ్యక్తి.. బైకుతో సహా పట్టాలు దాటాలని అనుకున్నాడు. దూరం నుంచి రైలు వస్తున్న సంగతి కూడా అతడికి తెలుసు. అయితే, ఆ రైలు కంటే వేగంగా పట్టాలు దాటేయొచ్చనే అతివిశ్వాసంతో దూసుకెళ్లాడు. కానీ, రైలు అతడు ఊహించిన స్పీడు కంటే వేగంగా వచ్చింది. దీంతో అతడు ముందుకు వెళ్లే సాహసం చేయలేదు. బ్రేక్ వేసి బైకు మీద నుంచి దూకే లోపే రైలు వచ్చేసింది. బైకును గట్టిగా ఢీకొట్టింది. అయితే, రైలు అతడిని ఢీకోలేదు. రైలు బైకును వేగంగా ఢీకొట్టింది. బైకు అతడి కాళ్లను బలంగా తాకినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. రాజేంద్ర అక్లేకర్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వీడియోలో నమోదైన తేదీ ప్రకారం.. ఫిబ్రవరి 12న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 


ఈ వీడియో చూసిన నెటిజనులు ఆ వ్యక్తిని నెటిజనులు తిట్టిపోస్తున్నారు. మరీ అంత నిర్లక్ష్యమైతే ఎలా? అతడేమైనా సూపర్ మ్యాన్ అనుకుంటున్నాడా అని అంటున్నారు. కొందరైతే.. ఈ దెబ్బకు అతడు మళ్లీ పట్టాలు దాటేందుకే బయపడతాడని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం.. ఈ సారి కూడా అతడు ఇలాగే పట్టాలు దాటుతాడని, భవిష్యత్తులో రైలు కంటే వేగంగా పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తాడేగానీ.. మైండ్ సెట్ మాత్రం మారదని అంటున్నాడు. అతడు మారతాడో లేదో తెలియదుగానీ.. ఈ వీడియో చూసి మీరైనా మారండి. అలా ఇష్టానుసారంగా పట్టాలు దాటేవారిని హెచ్చరించండి. 






ఇదివరకు కూడా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి బైకును పట్టాల మీదకు తీసుకొచ్చాడు. దీంతో రైలు ఢీకొట్టింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.






Also Read: విమానంలో స్నేక్ బాబు ఫ్రీ జర్నీ, ఆ పాము ఎలా దూరిందబ్బా?


Also Read: ముప్ఫై ఏళ్ల క్రితం మునిగిన గ్రామం తొలిసారి బయటపడింది, వీడియో చూడండి