కోచింగ్‌ సెంటర్‌లో ఇదేం పని బాబు..


కోచింగ్ సెంటర్‌లో ఏం చేస్తారు..? ఇదేం ప్రశ్న అనుకోకండి. అన్ని కోచింగ్ సెంటర్లు ఒకేలా ఉండవు. బిహార్‌లో జరిగింది తెలుసుకున్నాక మీరు కూడా ఇదే మాట చెబుతారు. గయా జిల్లాలోని కోచింగ్‌ సెంటర్‌లో ఓ భోజ్‌పురి ఐటమ్‌ సాంగ్‌కు విద్యార్థులంతా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ట్విటర్‌లో వైరల్ అవుతోంది. బిహార్‌ విద్యావ్యవస్థపై ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు రావటం ఇంకా వివాదాస్పదమవుతోంది. ఇటీవల తరచుగా అక్కడి విద్యావ్యవస్థలోని లోపాలను బయటి ప్రపంచానికి తెలియజేసే ఘటనలు జరుగుతున్నాయి. అందులో ఇదీ ఒకటి. ఈ వీడియోలో విద్యార్థులంతా హుషారుగా ఐటమ్‌ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ ట్యూన్‌కి తగ్గట్టుగా గట్టిగా అరుస్తూ డ్యాన్స్ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే...అక్కడే టీచర్ కూడా ఉన్నాడు. విద్యార్థులను వారించాల్సింది పోయి వారితో పాటు కలిసి చిందులేశాడు. ఇంతకీ ఈ కోచింగ్ సెంటర్ పేరేంటో తెలుసా..? వికాస్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎంటర్‌టైన్ చేస్తున్న కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం కేవలం రిఫ్రెష్‌మెంట్ కోసం ఇలా చేసుంటారని చెబుతున్నారు.