Viral News: కుక్కలు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. నూటికి 99 శాతం మంది కుక్కలు పెంచుకోవడాన్ని, వాటితో సమయం గడపడాన్ని చాలా ఇష్టపడతారు. ఇంట్లో పెంచుకునే కుక్కలను ఇంటి కుటుంబసభ్యుల్లాగే పరిగణిస్తారు. ఇంట్లోని వ్యక్తిని ఎంత ప్రేమగా, అభిమానంతో చూస్తారో.. కుక్కల పట్ల అంతకుమించిన ప్రేమను కనబరుస్తారు. కొంత మంది అయితే వాటితో కలిసి తింటుంటారు. ఎక్కడికి వెళ్లినా వెంటే తీసుకెళ్తారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా, దూర ప్రాంతాలకు వెళ్లినా, బైక్ పై, కార్లలో కూడా వాటిని వెంటే తీసుకెళ్తారు.
ఇక వాటికి స్నానం చేయించడం, ఇన్ఫెక్షన్లు సోకకుండా తరచూ ఇంజెక్షన్లు ఇప్పించడం, బొచ్చు రాలకుండా తరచూ దువ్వెనతో దూయడం.. ఇలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కుక్కలను. ఇక శునకాలు కూడా తమ యజమానుల పట్ల అంత కంటే ఎక్కువ ప్రేమను, విశ్వాసాన్ని చూపిస్తాయి. కూర్చోమంటే కూర్చుంటాయి, నిలబడమంటే నిలబడతాయి. తమ యజమానుల వెంటే తిరుగుతుంటాయి. వారికి ఏదైనా ఆపద వస్తే ముందుండి కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇలాంటి అనేక కారణాల వల్ల శునకాలు అంటే చాలా మందికి ఇష్టాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని కనబరుస్తారు.
కొందరు ఈ ప్రేమాభిమానాలను మరో స్థాయికి తీసుకెళ్తారు. దానికేదైనా దెబ్బ తగిలితే యజమానులు తల్లడిల్లిపోతారు. అలాగే శునకాలు పుట్టిన రోజులకు కేకులు కట్ చేయించడం, పిల్లలు పుడితే బారసాల చేయడం లాంటివి చేస్తూ తమ ప్రేమను కనబరుస్తారు. అలాంటి ఓ ఘటనే తాజాగా కర్ణాటకలో జరిగింది. ఓ కుటుంబం తాము పెంచుకుంటున్న శునకం పట్ల అమితమైన ప్రేమను కనబరిచింది. ఇప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయగా చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు.
కర్ణాటకలోని గదక్ జిల్లాకు చెందిన అశోక్ అనే వ్యక్తి శునకాలు అంటే అమితమైన ఇష్టం. వారింట్లో ఓ శునకాన్ని కూడా పెంచుకుంటున్నారు. అయితే ఆ శునకం ప్రస్తుతం గర్భవతి. ఆ ఇంటిల్లిపాది చుట్టుపక్కల మహిళలు అంతా కలిసి దానికి సీమంతం చేశారు. ప్రస్తుతం ఈ సీమంతానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శునకం సీమంతానికి పండ్లు, పూలు పెట్టారు. దాని కోసం ఓ చీరను కొనుక్కొచ్చి చుట్టూ చుట్టారు. బొట్టు పెట్టి హారతి కూడా ఇచ్చారు. ఈ తతంగం అంతా ఓ మహిళకు సీమంతం చేస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఏదీ తక్కువ కాకుండా శునకానికి సీమంతం చేశారు.
ఈ వీడియోను తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ పేజ్ జులై 28 వ తేదీ మధ్యాహ్నం 1.26 గంటలకు పోస్టు చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 8 వేల మందికిపైగా వీక్షించారు. వందల్లో కామెంట్లు కూడా వచ్చాయి.