Missing Politics : తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వానలు, వరదలు వచ్చినా ప్రజల్ని పట్టించుకోవడం లేదని ఒకరిపై ఒకరు వాంటెడ్ పోస్టర్లు ఊరంతా అతికిస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో మొదట పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లపై ఎవరి పేరూ లేదు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వాటిని వైరల్ చేశారు.
కాసేపటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా.. సీఎం కేసీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు వేసి.. వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి ప్రశ్నించడం ప్రారంభించారు.
ఈ లిస్టులోకి తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా చేరింది. కేసీఆర్ పోస్టర్ పెట్టి.. మిస్సింగ్ అని ప్రకటించింది.
కొసమెరుపేమిటంటే ఈ మిస్సింగ్ రాజకీయాల్లో కొందరు అసలు సమస్యలను కూడా తెలుస్తున్నారు. హైదరాబాద్ రోడ్లు మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో నేతలు పర్యటించడం లేదని చెప్పడానికి .. ఇలాంటి పోస్టర్లను నిరసనలుగా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. డిల్లీ ప్రభుత్వ అధికారాలకు సంబంధించిన ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోతోంది. అందకే . కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఈ కారణంగా ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని ఆయన వర్గీయుు చెబుతున్నారు. అదే సమయంలో.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని.. ఆదేశాలు జారీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాజకీయంగా విమర్శలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా పోస్టర్లు వేస్తున్నారని రెండు వర్గాలు ఆరోపిస్తున్నాయి.