Polavaram Chandrababu :  ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి అహంకారంతో నాశనం  చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ ఆఫీసులో  పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ప్రభుత్వం తీరు వల్ల ప్రాజెక్టు పడకేసిందన్నారు. పోలవరం పునరావాసానికి టీడీపీ హయాంలో రూ. 4114 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం రూ. 1890 కోట్లే ఖర్చు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ. 19 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. పరిహారం ఇవ్వకపోగా లబ్దిదారుల జాబితా మార్చి అవకతవకలకు పాల్పడ్డారన్నారని మండిపడ్డారు. 


ప్రమాణస్వీకారం రోజునే పోలవరం పనులు నిలిపివేసిన సీఎం జగన్                              


ప్రమాణ స్వీకారం రోజునే పోలవరం పనులను నిలిపేసిన ఘనత జగన్‌దేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సుమారు 15 నెలల పాటు పోలవరం వద్ద ఎలాంటి నిర్మాణ సంస్థే లేకుండా చేశారన్నారు. కాంట్రాక్టరును మార్చొద్దని పీపీఏ చెప్పినా జగన్ వినలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చెప్పినా   మూర్ఖుడు కాంట్రాక్టరును మార్చారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  నాటి వైఎస్ ప్రభుత్వం వేసిన చిక్కుముళ్లను విడదీసి పోలవరం నిర్మాణం చేపట్టామన్నారు. పోలవరం నిమిత్తం టీడీపీ హయాంలో 11,537 కోట్లు ఖర్చు పెడితే.. జగన్ కేవలం రూ. 4611 కోట్లతో సరిపెట్టారన్నారు. టీడీపీ హయాంలో 45.72 మీటర్ల ఎత్తున పోలవరం నిర్మించాలనుకుంటే.. జగన్ 41.15 మీటర్ల ఎత్తుతోనే సరిపెడుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.  


ఏపీ జీవనాడిని ధ్వంసం చేసిన జగన్                                    


పోలవరం తరతరాల ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ధవళేశ్వరం ఆనకట్ట కంటే ముందే పోలవరం నిర్మించాలనే ప్రతిపాదన ఉందన్నారు.  పోలవరం రాష్ట్రానికి ఓ వరమన్నారు. పోలవరానికి జగనే శని అని.. అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదన్నారు. పోలవరం పూర్తైతే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లివ్వొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. లక్షల ఎకరాల్లో పంటలకు, పరిశ్రమల అవసరాలకు నీటి సౌకర్యం కల్పించవచ్చన్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. 


ఆగస్టు 1 నుండి చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన                               


 టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు  ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లనున్నారు.  ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని, 3న గండికోట రిజర్వాయర్ పరిశీలన తర్వాత అనంతపురం జిల్లాకువస్తారు.   4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్‌లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారు.  వరుసగా రాష్ట్రంలోని అన్ని  ప్రాజెక్టులనూ పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టను కూడా సందర్శించే అవకాశం ఉంది.