Viral News: ఒక ఉద్యోగస్తుడి కష్టాలు అతనికే మాత్రమే తెలుస్తాయి. చుట్టుపక్కల వారు మాత్రం ‘వాడికేంటి బాగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. హ్యాపీగా ఉన్నాడు’ అని అనుకుంటారు. కానీ ఒక ఉద్యోగి భరించే పని ఒత్తడి గురించి వారికి తెలీదు. సెలవు రోజుల్లో అయినా పని చేయాలి. డెడ్‌లైన్లు, టాస్కులు, రిపోర్టులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వాటి ద్వారా ఉద్యోగి ఎంత పనిభారం ఫీల్ అవుతాడో కొందరికే తెలుసు.
ఉద్యోగాన్ని బట్టి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం లేదా పని చేసే స్థలం సరైనది కానప్పుడు, యజమాని సున్నితత్వం లేని కఠినాత్ముడు అయితే ఉద్యోగి ఇంకా అదనపు ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఫలితంగా పని వాతావరణం ప్రతికూలత, నిరాశ, సంఘర్షణలకు దారితీస్తుంది. ఇలాంటి వాటితో చాలా మంది వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఈ రోజుల్లో, చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన జీవితాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఆఫీస్‌లు, పని ప్రదేశాల్లో వారు ఎదుర్కొంటున్న అనుభవాలను వివరిస్తున్నారు.. ఇటీవల ఓ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవు తీసుకున్నప్పుడు తనను ఎలా చూశారో, తనతో ఎలా ప్రవర్తించారో వివరించారు.
‘నేను కంపెనీలో చేరినప్పటి నుంచి అది మొదటి సెలవు. నన్ను ఓ నేరస్థుడిలా చూశారు’ అంటూ అనే పోస్ట్ చేశాడు. సెలవు తీసుకున్నప్పుడు తన సహచరులు అసహ్యంగా చూశారని పేర్కొన్నాడు. సెలవులో ఉన్నప్పుడు ఈమెయిల్స్ చెక్ చేసుకోలేదని దీనిపై తోటి ఉద్యోగులు అసహ్యంగా కోపంగా చూశారని ఎందుకూ పనికి రాని వాడిలా ట్రీట్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఉద్యోగంలో చేరిన 8 నెలల తరువాత మొదటి సారి సెలవు తీసుకుంటున్నాను. మీరు ఈ పనులను రేపటిలోగా పూర్తి చేయాలి. నేను రేపటి నుంచి ఒకటిన్నర వారం సెలవులో ఉంటానని చెప్పాను. వారు నా ల్యాప్‌టాప్ తీసుకొని ఈమెయిల్‌లను చెక్ చేయాలనుకున్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. నా ల్యాప్‌టాప్ నేను తీసుకున్నాను. ప్రతి 4-5 రోజులకు ఒకసారి మాత్రమే ఈ మెయిల్స్ చూస్తానని చెప్పాను. ఆ టైంలో వారు నావైపు చాలా అసహ్యం, అపనమ్మకంగా, ఓ నేరస్తుడిలా చూశారు.’ అంటూ రాసుకొచ్చాడు.
అతని సమస్య విన్న నెటిజన్లు సానుభూతి తెలిపారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం రెండు వేర్వేరు అని అన్నారు. ఒకరు స్పందిస్తూ ‘విహారం లేదా బయటకు వెళ్తున్నప్పుడు మీ ల్యాప్‌టాప్‌ని అస్సలు తీసుకోవద్దు. మీ వ్యక్తిగత, మీకు నచ్చిన వాటిని మాత్రమే మీతో తీసుకెళ్లండి. సెలవుల్లో సైతం ఈ మెయిల్స్ తనఖీ చేయడం ద్వారా మానసికంగా ఇబ్బంది పడతారు. ఒత్తిడికి గురవుతారు.’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘ ఇలాంటి సమస్యతోనే గత సంవత్సరం ఉద్యోగాన్ని మానేశాను. నేను విదేశాలకు వెళ్లినప్పుడు రోజుకు 10 సార్లు ఫోన్ చేసి వేధించేవారు. తిరిగి వచ్చిన తరువాత మా జీఎంపై నేను అరిచాను. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు నోటీసు ఇచ్చాను. తర్వాత అతను నాపై మరింత కోపంగా అరిచాడు. నేను సెలవులో ఉన్నప్పుడు కూడా యథావిధిగా పని చేస్తానని అతను ఊహించాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు సెలవులు తీసుకోవడం నాహక్కు. సెలవు రోజుల్లో పనిచేయాల్సిన అవసరం లేదు’ అంటూ తన అనుభవాన్ని వివరించాడు.
ఇంకో వ్యక్తి స్పందిస్తూ.. ‘సెలవు అంటే సెలవు. నేను నా ల్యాప్‌టాప్ తీసుకురాను. నేను నా వ్యక్తిగత ఫోన్‌లో పనికి సంబంధించిన ఇమెయిల్/టూల్స్‌ని ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయను. లైఫ్ అండ్ డెత్, ఎమర్జెన్సీ అయితే తప్ప మిగతా సందర్భంగాల్లో చేయాల్సిన అవసరం లేదు’ అని రాసుకొచ్చారు.