ఇలా నష్టం చేస్తున్నాయి..


కప్పలు, పాములు గ్లోబల్ ఎకానమీని దెబ్బ తీస్తున్నాయి. వాటి వల్లే వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇవేం పిచ్చి స్టేట్‌మెంట్‌లు అని తొందరపడి అనుకోకండి. ఓ అధ్యయనం చెప్పిన సంగతి ఇది. కేవలం కప్పలు, పాముల వల్ల దాదాపు 16 బిలియన్ డాలర్ల మేర ప్రపంచ ఎకానమీ నష్టపోవాల్సి వస్తోందని తేల్చి చెప్పింది ఆ స్టడీ. అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌, బ్రౌన్‌ ట్రీ స్నేక్ కారణంగా...1986 నుంచి 2020 వరకూ జరిగిన నష్టమిదని వెల్లడించింది. అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌లు పంట పొలాల్ని నాశనం చేస్తుండగా, బ్రౌన్ ట్రీ స్నేక్‌లు ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌లపైకి ఎక్కి విలువైన వాటిని డ్యామేజ్ చేస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. బ్రౌన్ అండ్ గ్రీన్ ఫ్రాగ్‌లను లితోబేట్స్‌ కాటెస్‌బియానస్ గా పిలుస్తారు. వీటి బరువు 2 పౌండ్లు. అంటే 0.9 కిలోలు. ఐరోపాలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ఈ రీసెర్చ్ నిర్ధరించింది. ఇక బ్రౌన్‌ ట్రీ స్నేక్‌లను బొయిగా ఇర్రెగ్యులారిస్‌గా పిలుస్తారు. పసిఫిక్ ఐల్యాండ్స్‌లో వీటి సంతతి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ, అవి పని చేయకుండా చేస్తున్నాయి ఈ పాములు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్లు ఈ పాములను ఇక్కడ వదిలారని చెబుతారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కొన్ని జీవ జాతులను రవాణా చేస్తున్నారు. వీటి కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తోందని, అందుకే వీటి రవాణాను అరికట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కొందరు కావాలనే విషపూరితమైన పాములను కొని తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఇలాంటి వారితో ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇకోసిస్టమ్‌ను దెబ్బ తీసే జీవ జాతుల్ని రవాణా చేయకుండా నివారించాలని చెబుతున్నారు.