Visakha Ring Nets Issue : విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం రాజుకుంది. సంప్రదాయ-రింగు వలల మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. లంగరు వేసిన 6 తెప్పలు, వలలను సంప్రదాయ మత్స్యకారులు తగలబెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. దీంతో జాలరి ఎండాడ, పెదజాలరిపేటలో పోలీసులు మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రింగు వలలు కాల్చేశారని వాసవానిపాలెం మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. రింగు వలల వివాదం మళ్లీ మొదలవ్వడంతో ఆ గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీస్ ల పహారాలో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.
రింగు వలలకు నిప్పు
విశాఖపట్నంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వలల వివాదం చెలరేగింది. రింగు వలలతో ఉన్న పడవలకు శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి కాల్చేశారు. మంటలను గుర్తించిన వాసవానిపాలెం, జాలరి ఎండాడకు చెందిన మత్స్యకారులు ఆ మంటలను ఆర్పేశారు. తమ వలలకు పెద్దజాలరిపేటకి చెందిన మత్స్యకారులే నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు మరో వర్గం మత్స్యకారులు. పెద్దజాలరి పేటకి చెందిన మూడు మర పడవలను వాసవానిపాలేనికి మత్స్యకారులు తీసుకొచ్చారు. ఈ ఘటనలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాసవానిపాలెం చేరుకుని మత్స్యకారులతో మాట్లాడారు. రింగు వలల వివాదాన్ని అధికారులు కావాలనే పరిష్కరించడంలేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
144 సెక్షన్ విధింపు
పెద్ద జాలరిపేటకు చెందిన మర పడవలను విడిచిపెట్టాలని పోలీసులు, మత్స్యశాఖ అధికారులు కోరారు. అయితే తమ వలలకు నిప్పుపెట్టిన వారిని అరెస్టు చేసి, తమకు పరిహారం ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని వాసవానిపాలెం మత్స్యకారులు చెబుతున్నారు. ఒక సమయంలో పోలీసులు, అధికారులపై మత్స్యకారులు తిరగబడేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా మత్స్యకార గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటుచేశారు. మత్స్యకారులతో పోలీసులు, అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Also Read : Polavaram Politics : పోలవరం కోసం రాజీనామాలు - ఏపీలో కొత్త రాజకీయ సవాళ్లు !
ఇటీవల బోటుకు నిప్పు
విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో పెద్దజాలరి పేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సముద్రంలో రింగు వల బోటును సంప్రదాయ మత్స్యకారులు తగలబెట్టారు. చిన్నజాలరిపేట గ్రామంలోకి వచ్చిన పెద్దజాలరిపేట మత్స్యకారులు రింగ్ వలలను ధ్వంసం చేశారు. రింగు వలల వాడకంతో సంప్రదాయ మత్స్యకారుల ఉపాధిపై దెబ్బకొడుతున్నారంటూ పెద్దజాలరిపేట మత్స్యకారులు ఆందోళన చేశారు. మత్స్యకారుల్లో ఓ వర్గం రింగు వలలతో సముద్రంలోకి వేటకు వెళ్లడాన్ని మరో వర్గం మత్య్సకారుల అడ్డుకున్నారు. సముద్రంలో రింగు వలల పడవకు ఓ వర్గం మత్స్యకారులు నిప్పుపెట్టారు. తమ బోట్లకు నిప్పు పెట్టారని, పిల్లలను ఓ వర్గం అపహరించిందని మరో వర్గానికి చెందిన మహిళలు ఆందోళన చేశారు. తమ వలలు కోసేశారని ఆరోపించారు.
సంప్రదాయ మత్స్యకారులు అభ్యంతరం
రింగ్ వలలతో చేపల వేట చేయకూడదని సంప్రదాయ వలలతో చేపలను వేటాడే మత్స్యకారులు కోరుతున్నారు. రింగ్ వలలతో చేపల వేటాడే వారితో సంప్రదాయ పద్ధతిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఘర్షణకు దిగుతున్నారు. ఇదే విషయమై ఇరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఘర్షణ పడ్డారు. రింగ్ వలలను నిషేధించాలని సంప్రదాయ మత్స్యకారులు కోరుతున్నారు.