టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోమువీర్రాజు. బీజేపీతో టీడీపీ కలిసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదన్నారు. అమరావతిలో బీజేపీ చేపట్టిన పాదయాత్రను ప్రారంభించిన సోమువీర్రాజు... ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ సంకల్పయాత్ర
మన అమరావతి బీజేపీ సంకల్పయాత్ర పేరుతో భారతీయ జనతాపార్టీ పాదయాత్ర చేపట్టింది. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులపై ప్రచారం చేపట్టనుంది బీజేపీ. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ సంకల్ప పాదయాత్ర కొనసాగనుంది.
వారం రోజుల పాటు యాత్ర
మన అమరావతి బీజేపీ సంకల్ప యాత్రను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఉండవల్లిలో ప్రారంభించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ చేపట్టిన యాత్రలో బిజెపి నాయకులు, అమరావతి ప్రాంత రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాల్గో తేదీ సాయంత్రం తుళ్ళూరులో యాత్రను ముగించనున్నారు. అక్కడే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకోలేదు
మన అమరావతి బీజేపీ సంకల్ప యాత్రను ప్రారంభించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అనేక పరిణామాలు జరిగాయన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజధాని కోసం రైతుల నుంచి భూములు సేకరించిందని... అయితే రాజధాని నిర్మించకుడా వదిలేసిందన్నారు. అయినా కేంద్రం రాజధాని అమరావతి కోసం 4వేలకోట్లు ఓసారి, 2500కోట్లు మరోసారి నిధులు ఆనాడు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ కోసం ఈ డబ్బుల వినియోగించలేదని ఆరోపించారు సోము వీర్రాజు.
నమ్మించి గొంతుకోశారు
మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిపై చాలా ప్రసంగాలు చేసిన జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు సోమువీర్రాజు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా... అమరావతిని అభివృద్ధి చేస్తా అని నమ్మించి గొంతుకోశారన్నారు. గెలిచిన తర్వాత మాట మార్చి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని తీవ్రంగా స్పందించారు.
వెంటనే పనులు చేపట్టాలి
టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాల కారణంగానే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి ఆగిపోయిందన్నారు సోమువీర్రాజు. జగన్ ప్రభుత్వం వెంటనే అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పది వేల ఎకరాలను అలాగే ఉంచి ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలన్నారు. కేంద్రం మొదటి నుంచీ చెప్పిన హామీలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఎయిమ్స్, ఫ్లైఓవర్లు, బైపాస్ నిర్మాణాలకు నిధులు ఇచ్చామన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే...
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అనంతపురం నుంతి అమరావతి వరకు రహదారి నిర్మిస్తామన్నారు సోమువీర్రాజు. రాజధానిలో అంతర్గత రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజధానికి రైతులు భూములు ఇచ్చినప్పుడే భూములు విభజించి ఇవ్వాల్సిందన్నారు సోమువీర్రాజు.
అలా జరిగి ఉంటే వైసీపీ గెలిచేది కాదు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. జగన్ ట్రాప్‌లో పడకుండా ఉండి ఉంటే ఇప్పుడు టీడీపీ బీజేపీతో ఉండేదన్నారు సోమువీర్రాజు. అలా జరిగి ఉంటే జగన్ అధికారంలోకి వచ్చేవారు కాదన్నారు. ఇప్పటికి కూడా రాజధాని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు సోము.
ఆర్థిక స్థితి బాగుంటే ఆందోళనలు ఎందుకు
కేంద్రం కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగుందని విజయసాయి రెడ్డి చెప్పడంపై కూడా సోమువీర్రాజు అనుమానం వ్యక్తం చేశారు. అంతలా డబ్బులు ఉంటే రాష్ట్రంలో రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు బియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలన్నారు. చేసిన పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్‌లు బిల్లుల ఎందుకు పోరాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డబ్బులు ఉంటే రాజధాని ఎందుకు కట్టలేదో ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ చెప్పిన మూడు రాజధానులపై ఎలాంటి పురోగతి లేదన్నారు.
అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్లడం బీజేపీ లక్ష్యమన్నారు సోమువీర్రాజు. పోలవరం విషయంలో చంద్రబాబు అడిగిన 25వేల కోట్ల రూపాయలనే అదనంగా జగన్ అడుగుతున్నారని గుర్తు చేశారు. అలా అడిగిన వాళ్లు పోలవరం విషయంలో ఆర్ ఆర్ ప్యాకేజీ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అవి ఇస్తే దొరికి పోతామన్న భయంతో కేంద్రానికి ఆ వివరాలు ఇవ్వడం లేదన్నారు. అవన్నీ చెబితే కేంద్రం కూడా పరిశీలించి నిధులు ఇస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా కేంద్రాన్ని నిందిస్తే నిధులు రావని ఎద్దేవా చేశారు సోమువీర్రాజు. జగన్ మోహన్ రెడ్డి అనుకునే డబ్బు మిషన్లు బిజెపి వద్ద లేవన్నారు. ఇప్పటికేనా పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలను ముంచకుండా నిజాలు తెలుసుకోవాలన్నారు. పోలవరంపై చిత్తశుద్ధి ఉంటే అన్ని లెక్కలు సమర్పించి కేంద్రం నుంచి నిధులు తేచ్చుకోమన్నారు సోమువీర్రాజు.