అక్కడ ఇదే సంప్రదాయం 


వాళ్లిద్దరూ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయారు. ఈ మధ్యే పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండీ? అంటారా. మీరు విన్నది నిజమే. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వారికి ఇటీవలే వివాహం జరిగింది. కమ్మనైన విందు కూడా పెట్టారు. ఏంటీ కన్‌ఫ్యూజన్‌ అని తిట్టుకోకండి. ఇది నిజంగానే జరిగింది. దక్షిణ కన్నడలో ఇదో సంప్రదాయం. కంటెంట్ క్రియేటర్ యానీ అరుణ్ ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌తోనే ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో అప్పటి నుంచి వైరల్ అవుతోంది ఈ ట్వీట్. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేశాడు. చాలా సేపటి వరకూ ఏంటిది అని బుర్ర బద్దలు కొట్టుకున్నారు నెటిజన్లు. యానీ అరుణ్ మాత్రం వరుస ట్వీట్‌లు చేశాడు. చాలా సేపటి తరవాత ఇది దక్షిణ కన్నడలో సంప్రదాయమని చెప్పాడు. "నేనో పెళ్లికి అటెండ్ అయ్యాను. నిజానికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు 30 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఇప్పుడు వాళ్లు వివాహం చేసుకుంటున్నారు. ఈ పెళ్లికే నేను వచ్చాను" అని ట్వీట్ చేశాడు. దక్షిణ కన్నడ సంప్రదాయం గురించి తెలియన వాళ్లకు ఇదేమీ అంతు పట్టకపోవచ్చు అని కూడా చెప్పాడు యానీ అరుణ్.


ఆ కండీషన్‌ ఓకే అయితేనే పెళ్లి..


ఆ తరవాతే అసలు విషయం చెప్పాడు. "ఇది వాళ్లు చాలా నిష్ఠగా పాటించే ఆచారం. పురిట్లోనే చనిపోయిన అబ్బాయికి, పురిట్లోనే చనిపోయిన మరో అమ్మాయితో వివాహం జరిపిస్తారు. అటు అబ్బాయి, ఇటు అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు లేకుండానే, వాళ్లను ఊహించుకుని పెళ్లి చేస్తారు. మామూలు పెళ్లిళ్లు ఎలా చేస్తారో అదే విధంగా ఈ తంతు నిర్వహిస్తారు. తాంబూలం ఇచ్చుకోవటం, కుర్చీలు వేసి ఇద్దరినీ కూర్చోబెట్టడం,  బట్టలు పెట్టటం లాంటి కార్యక్రమాలన్నీ ఘనంగా చేస్తారు. దీనికి ముందు రెండు కుటుంబాలు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి నిశ్చితార్థం కూడా చేస్తారు" అని వివరించాడు యానీ అరుణ్. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...ఈ సంప్రదాయంలో "రిజెక్ట్" చేయటమూ ఉంటుంది. అంటే..పురిట్లోనే చనిపోయిన అబ్బాయి కన్నా, పురిట్లోనే చనిపోయిన అమ్మాయి వయసు చిన్నదైతే అలాంటి పెళ్లిళ్లు చేయటానికి పెద్దలు అంగీకరించరు. అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలనే ఆచారాన్నీ వీళ్లూ పాటిస్తారు. అదన్న మాట సంగతి. మొత్తానికి ఆయన ఇచ్చిన ఈ క్లారిటీతో నెటిజన్లు ఇంకాస్త షాక్ అయ్యారు. ఇదేం సంప్రదాయం చాలా వింతగా ఉందే అని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ. కర్ణాటకలోని మంగళూరులో.