Woman Job Application Return Back After 48 Years: ఉద్యోగం అంటే ఓ గౌరవం. నచ్చిన రంగంలో రాణించాలని అంతా కలలు కంటారు. ఏదైనా చిన్న కాంపిటీటివ్ పరీక్ష రాస్తేనే.. ఫలితం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తాం. అయితే, ఓ మహిళ తనకు నచ్చిన ఉద్యోగం కోసం ఏకంగా ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూసింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఆమెకు నిరాశే ఎదురైంది. ఇన్నేళ్లుగా ఎదురుచూసినా ఆమె జాబ్ అప్లికేషన్ వెనక్కు తిరిగి వచ్చిన ఘటన లండన్‌లో (London) జరిగింది. ఆ ఉద్యోగావకాశం దశాబ్దాలుగా దూరం కావడం వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే..


లింకన్ షైర్‌కు చెందిన టీజీ హడ్సన్ (TG Hadson) అనే మహిళ మోటార్ సైకిల్ స్టంట్ రైడర్‌గా రాణించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో ఆ ఉద్యోగానికి 48 ఏళ్ల క్రితం అప్లై చేశారు. అయితే, ఎంత ఎదురుచూసినా ఆమెకు రిప్లై మాత్రం రాలేదు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఆ జాబ్ అప్లికేషన్ వెనక్కు రావడంతో ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి కారణం ఆ పోస్ట్ ఆఫీస్‌లో జరిగిన చిన్న పొరపాటు. ఆమె దరఖాస్తు కార్యాలయంలోని సొరుగులో ఇరుక్కుపోయింది. తాజాగా ఇది బయటపడగా.. అధికారులు దీన్ని గుర్తించి అసలు విషయాన్ని సదరు మహిళకు వివరించారు. 'మోటార్ సైకిల్ స్టంట్ రైడర్‌గా రాణించాలని కలలు కన్నాను. సమాధానం కోసం ప్రతి రోజూ ఎంతో ఎదురుచూశాను. అయితే, చివరకు నాకు నిరాశే మిగిలింది. దాదాపు 48 ఏళ్ల తర్వాత నాకు ఆ లెటర్ వచ్చింది. ప్రస్తుతం నా చిరునామాకు ఈ లెటర్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.' అని హడ్సన్ పేర్కొన్నారు. స్థానికంగా ఈ విషయం వైరల్‌గా మారింది.


Also Read: Waiter Job in Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం బారులు తీరిన భారతీయ విద్యార్థులు- వైరల్‌గా మారుతున్న వీడియో!