India Vs Australia: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు అన్యాయం జరిగింది. థర్డ్ అంపైర్ పక్షపాతంతో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంఘటన శనివారం ఆసీస్ ఇన్నింగ్స్ తొలి సెషన్ చివర్లో జరిగింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోయిన కంగారూ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో ఎల్బీ కోసం అంపైర్ ను అడుగగా, అంపైర్ నాటౌట్ గా స్పందించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మను కన్విన్స్ చేసిన అశ్విన్ డీఆరెస్ రివ్యూ తీసుకునేలా చేశాడు. అయితే ఇందులో భారత్ కు ప్రతికూల ఫలితం వచ్చింది. 






సరైన ఆధారం లేదని..
అయితే థర్డ్ అంపైర్ స్థానంలో ఉన్న రిచర్డ్ కెటిల్ బ్రూ.. పక్షపాతంతో వ్యవరించినట్లు భారత అభిమానులు శాపనార్థాలు పెడుతున్నారు. బంతి బ్యాటుకు, ప్యాడుకు ఒకేసారి తగిలినట్లు రిప్లేలో కనిపించింది. అయితే మరింత జూమ్ చేసి చూడగా, బంతి ముందుగా ప్యాడ్ కి తగిలినట్లు కనిపించింది. అయితే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదని ఏకపక్షంగా తీర్మాణించిన అంపైర్.. మార్ష్ ను నాటౌట్ గా నిర్దారించాడు. కనీసం బాల్ ట్రాకర్ ను కూడా వినియోగించడానికి ఇష్టపడేలేదు. దీంతో భారత్ కీలకమైన రివ్యూ కోల్పోయింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్ల మొహంలో నిరాశ కనిపించింది. అయితే ఈ సంఘటన చూసిన కామెంటేటర్లు మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ముందుగా ప్యాడ్ నే బంతి తాకినట్లుగా వాళ్లు మాట్లాడారు. అయితే చివరికి అశ్విన్ బౌలింగ్ లోనే మార్ష్.. పంత్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడు.






కెటిల్ బ్రూ అంటే టెర్రర్..
మరోవైపు ఇంగ్లాండ్ కి చెందిన అంపైర్ రిచర్డ్ కెటిల్ బ్రూ అంటేనే భారత అభిమానులు కంగారు పడుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తను అంపైర్ గా ఉన్నాడంటే చాలు, భారత్ కు ఏదో మూడుతుందని బలంగా నమ్ముతారు. 2019 వన్డే ప్రపంచకప్పు సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడినప్పుడు కెటిల్ బ్రూనే అంపైర్ గా వ్యవహరించాడు. అలాగే భారత్ ఓడిపోయిన చాలా మ్యాచ్ లకు తను అంపైర్ గా వ్యవహరించడంతో మ్యాచ్ కు ముందుగా అంపైర్ ఎవరనే విషయంపై భారత అభిమానులు అప్రమత్తంగా ఉంటున్నారు. 



ట్రావిస్ హెడ్ సెంచరీ..
మరోవైపు రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. శనివారం రెండో రోజు కడపటి వార్తలు అందే సమయానికి 75 ఓవర్లలో 5 వికెట్లకు 273 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓవరాల్ గా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 64, 9 ఫోర్లు) అర్థ సెంచరీతో ఎట్టకేలకు లయ దొరకబుచ్చుకున్నాడు. ఓవర్ నైట్ బ్యాటర్ మెక్ స్విన్నీ (39), త్వరగానే పెవిలియన్ కు చేరగా, మాజీ కెప్టెన్, స్టీవ్ స్మిత్ (2) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇక భారత్ కు కొరకరాని కొయ్య అయినటువంటి ట్రావిస్ హెడ్ అజేయ సెంచరీ (114 బ్యాటింగ్, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) వన్డే తరహాతో ఆటతీరుతో భారత బౌలర్లపై మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శించాడు. మిషెల్ మార్ష్ (9) విఫలమవగా, అలెక్స్ క్యారీ (12 బ్యాటింగ్) తనకు సహకారం అందించాడు. భారత బౌలర్లలో స్పీడ్ స్టర్ జస్ ప్రీత్ బుమ్రాకు మూడు, తెలుగు యువ కెరటం నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్ కి తలో వికెట్ దక్కింది. 


Also Read: Ind Vs Aus 2nd Test: సిరాజ్ మియా.. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ @ 181.6 కేపీహెచ్.. ఏది నిజం..?