ఊరు శివార్లలో ఉంటున్న పంటపొలాల్లో పని చేయాలంటేనే కూలీలు, రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పొలంపనులు చేయడానికి ముందు అందులో దిగి.. ఎక్కడ గాజు పెంకులు ఉన్నాయో అని కూలీలను పెట్టి చెక్ చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు. దీనికి అదనంగా ఖర్చు అవుతోంది. లేకుంటే కూలీలు గాయపడి పనల్లోకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంతకీ సమస్య ఏంటంటే?


చాలా మంది మందుప్రియులు ప్రశాంతమైన వాతావరణం... చల్లగాలిలో సిటింగ్ వేస్తుంటారు. నలుగురైదుగురు తోడై ఊరిచివర పొలాల్లో కూర్చొని మందు కొడుతుంటారు. ఇది వారికి ఆనందాన్ని ఇస్తుంది. తాగేసిన తర్వాత బాటిళ్లు అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. అదే రైతుల పాలిట శాపంగా మారుతోంది. పొలాల్లోని ఆ బాటిళ్లను ఆకతాయిలు పగులుగొట్టినా... అవి బురదలో కూరుకుపోయినా ప్రమాదం వాటిల్లుతోంది. 


పొలాలు దున్నేటప్పుడు, దమ్ము పెట్టేటప్పుడు, నాట్లు వేసినప్పుడు కాళ్లకు గుచ్చుకుంటున్నాయి. కాళ్లు తీవ్ర గాయాలవుతున్నట్టు రైతులు వాపోతున్నారు. ఇలాంటి సమస్యల కారణంగా వారం పదిరోజులు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందని... కూలీ దొరకడం లేదంటున్నారు కూలీలు. అందుకే ఊరి శివార్లలోని పొలాల్లో ముందుగా బాటిళ్లు వెతికించే పనిలో పడ్డారు రైతులు.  


తెలంగాణలో ఓపెన్ డ్రింకింగ్ విధానం నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇది యథేచ్ఛగా సాగిపోతోంది. ఊరికి అవతల పొలాలకు సమీపంలో ఉండే వైన్స్‌లో మందు సీసాలను కొనుగోలు చేసి బహిరంగ ప్రదేశాల్లో కార్ పార్కింగ్ చేసుకొని మరీ తాగుతున్నారు. సరే అక్కడ వరకు ఎవరికీ పెద్దగా సమస్య లేకపోయినా.. మద్యం మత్తులో బాటిళ్లు పగలగొడతున్నారు. వాటిని పంటపొలాల్లోకి వేసేస్తున్నారు. 


రెండు గంటల పాటు గాజు ముక్కలు ఏరే పని..!


తెల్లవారుజామునే తమ పొలాల్లో పనుల కోసం వస్తున్న కూలీలకు పగిలిన గాజు సీసాలు స్వాగతం పలుకున్నాయి. అవి చూడకుండా అడుగు వేస్తే.. ఇక అంతే సంగతులు. ఇలా చాలా మంది తీవ్ర గాయాలపాలై కాళ్లు కదపలేకపోతున్నారు. సాధారణంగా కూలీ పనులు చేసేటప్పుడు ఎవరూ పాదరక్షలు వేసుకోరు. దీంతో నాట్లు వేసేందుకు పొలాల్లో దిగిన వారి పాదాలను గాజు ముక్కలు నిలువునా చీల్చేస్తున్నాయి.


అందుకే పొలం పని ప్రారంభించే ముందే ఒక గంట రెండు గంటల సమయం ఆ ప్రాంతమంతా వెతికి మరీ బాటిళ్లు ఏరుకునే దుస్థితి నెలకొంది. ఇలాంటి సమస్య భవిష్యత్‌లో ఉండకూడదని భావించిన ఓ రైతులు వినూత్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే రాయించిన పదాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పొలం పక్కన ఉన్న సిమెంటు గద్దెపై "దయచేసి మద్యం సీసాలు బీరు బాటిళ్లు తాగేసి వ్యవసాయ పొలాల్లో పడేయకండి. అలా పడేసిన మద్యం సీసాలు రైతులకు వారు ప్రాణంగా చూసుకునే కాడెద్దులకు సైతం గుచ్చుకుంటూ గాయపరుస్తుంది" అంటూ బాధాకరమైన వ్యాఖ్యలు రాయించాడు. దీనిపై చాలా మంది నెటిజెన్లు స్పందించారు. ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్నను, రైతు కూలీలను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ వాళ్లు షేర్లు చేయడం స్టార్ట్ చేశారు. 




అసలు ఎందుకిలా చేస్తున్నారు..?


గతంలో మాదిరిగా జనావాసాలకు దూరంగా మందుషాపులు ఉండాలంటూ వచ్చిన నిబంధన వల్ల కొంత మంది మందు పార్టీలకు పంటలు పొలాలను ఎంచుకుంటున్నారు. చీకటి పడిందంటే చాలు వ్యవసాయ క్షేత్రాలన్నీ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లతో వచ్చి అర్ధరాత్రి వరకు తాగుతున్నారు. అయితే కొందరు పగలకొట్టి బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో వారి వికృత ఆనందానికి సాధారణ రైతులు, రైతు కూలీలు బలి కావలసి వస్తోంది. పోలీసులు కాస్త అప్రమత్తంగా ఉండి ఇలాంటి సిట్టింగ్స్ లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.