Shark sighting while tourists are swimming పర్యాటకులు సముద్ర తీరంలో ఈత కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద షార్క్ చేప కనిపించడంతో అందరూ ఒక్కసారిగా హడలిపోయారు. సోమవారం నాడు పోర్టో డి బేర్స్ బీచ్ వద్ద సముద్రతీరానికి చేరుకున్న ఈ షార్క్ ఫిష్ సరదాగా తీరం వద్ద తిరుగుతూ కపనిపించింది. దాదాపు 10 అడుగుల కన్నా పెద్దదిగా ఉన్న భయంకరమైన ఈ షార్క్ చేపను చూసిన పర్యాటకులకు వెన్నులో వణుకు పుట్టింది. దాన్ని చూసినవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు, పర్యాటకులు దూరం నుంచి ఆ షార్క్ తిరుగుతుండటాన్ని తమ సెల్‌ఫోన్లు, కెమెరాలలో బంధించారు. సాధారణంగా షార్క్‌లు లోతైన సముద్ర జలాలను దాటి ఒడ్డుకు చేరుకోవడం జరగదు. కాబట్టి పర్యాటకులు ఏ భయం లేకుండా సంతోషంగా వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనతో రెండు రోజులపాటు బీచ్‌ను మూసేశారు అధికారులు.
అంతరించి పోతున్న జాతి షార్క్ ఇది
డైలీ మెయిల్ కథనం ప్రకారం, ఈ సంఘటన సోమవారం సాయంత్రం 5 గంటలకు లా కొరునాలోని గలీషియన్ ప్రావిన్స్‌లోని మనోన్ పట్టణానికి సమీపంలో ఉన్న పోర్టో డి బేర్స్ బీచ్ వద్ద జరిగింది. ఈ షార్క్‌ను అంతరించిపోతున్న జాతిగా పేర్కొంటున్న హాని చేయని బాస్కింగ్ షార్క్‌గా గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ, స్థానిక మేయర్ ఆల్ఫ్రెడో డోవాలే ఈ రకమైన షార్క్‌ను తీరానికి దగ్గరగా చూడలేదని, ఇది అధిక నీటి ఉష్ణోగ్రతలకు సంబంధించినదని భావించినట్లు పంచుకున్నారు. "ఇది కదులుతున్న విధానాన్ని బట్టి ఏదో దిక్కుతోచని లేదా అనారోగ్యంగా ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు. ఈ చేప ప్రమాదకరమైనది కాదని, ఎలాంటి హాని చేయదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటివరకు ఎప్పుడొచ్చి మీద పడి లాక్కుని పోతుందోనని ఆందోళన చెందినవారంతా హమ్మయ్య అని సరదాగా షార్క్ ఫొటోలు తీస్తూ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేశారు.
మళ్లీ రెండవసారి ప్రత్యక్షం
తరువాత, మంగళవారం రెండవసారి ఈ చేపలు కనిపించాయి. కానీ ఈసారి మాత్రం, తీరానికి కొంచెం దూరంలో షార్క్ చేపలు ఉన్నాయి. యూరోపియన్ తీరప్రాంతాల్లో షార్క్ లు కనిపించడం ఇదేమీ మొదటిసారి మాత్రం కాదు. గతంలోనూ ఓ 24-అడుగుల బాస్కింగ్ షార్క్, రెండవ అతిపెద్ద సొరచేప జాతి, ఐర్‌షైర్‌లోని స్కాటిష్ గ్రామమైన మైడెన్స్‌లోని బీచ్‌లో కనిపించింది. హామర్‌హెడ్ షార్క్ కనిపించడంతో బీచ్ ను మూసివేశారు. ఈ ఏడాది జూన్‌లో, స్పానిష్ పోలీసులు గ్రాన్ కానరియా తీరంలో ఈత కొడుతున్న ఒక సొరచేపను గుర్తించారు. ఆ చేప చివరికి లోతైన నీటిలోకి ప్రవేశించింది. దీంతో టెల్డే పట్టణంలోని ప్రసిద్ధ మెలెరా బీచ్‌ను కూడా మూసివేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు రోజులు బీచ్‌ను మూసేసిన అధికారులు మళ్లీ పర్యాటకులను అనుమతించారు. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.