Satyanarayana Vratham In America: ఏ దేశంలోనైనా భారతీయ ఆచారాలు, సంప్రదాయాలకు ఉన్న స్థానమే వేరు. విదేశాల్లో స్థిరపడినా చాలా మంది భారతీయులు ఇక్కడి పూజా విధానాలను సంప్రదాయబద్ధంగా ఆచరిస్తుంటారు. విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయతకు ఫిదా అవుతుంటారు. కాగా, కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా శ్రీ సత్యనారాయణ స్వామిని భక్తులు కొలుస్తుంటారు. సత్యదేవుని వ్రతానిది ఓ ప్రత్యేక స్థానం. నూతన గృహ ప్రవేశ సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్త ఇంట్లో ఆచరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నూతన దంపతులు ఆచరిస్తే వారు కలకాలం సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు.
అమెరికాలో సత్యదేవుని వ్రతం
అలాంటి సత్యదేవుని వ్రతాన్ని (Satyanarayana Vratham) అమెరికాలోని (America) ఓ నూతన ఇంట్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. అర్చకులు వేద మంత్రాలు చదువుతుండగా అక్కడి వారు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామికి పూజలు చేశారు. ఇంకో విశేషం ఏంటంటే.. వారికి సత్యదేవుని వ్రత కథ అర్థమయ్యేలా అయ్యవారు ఇంగ్లీష్‌లో కథను వివరించారు. దీన్ని చూసిన ఏ దేశంలోనైనా భారతీయ సంప్రదాయత, ఇక్కడ దేవుళ్లు, పూజలకు ఉండే స్థానమే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.