Railway Minister Ashwini Vaishnav Shares Picture Of New Pamban Bridge: తమిళనాడు రామేశ్వరంలోని (Rameswaram) తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ న్యూ పంబన్ బ్రిడ్జి (New Pamban Bridge) దృశ్యాలు వావ్ అనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) వీటిని షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించగా.. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావిస్తూ రైల్వే మంత్రి పలు ఫోటోలు షేర్ చేశారు. ఈ వంతెన ఓ ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడారు.
'1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. తుప్పు పట్టిన కారణంగా ఆ వంతెన సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త పంబన్ వంతెనను ప్రభుత్వం నిర్మించింది.' అంటూ అశ్వినీ వైష్ణవ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతను కొత్త వంతెన నిర్మాణంలో ఉపయోగించినట్లు చెప్పారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని అన్నారు.
పాత వంతెన విశేషాలివే..
- రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం (పంబన్ ద్వీపం) మధ్య 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణం రూ.20 లక్షలతో పూర్తైంది. 2.06 కి.మీ పొడవైన వంతెనను 2006 - 07లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చారు.
- ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్స్ వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. 2019, మార్చిలో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.
- సముద్రంలో ఓడలు వంతెన దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ఇదే. 2070 మీటర్ల పొడవైన ఈ రైల్వే బ్రిడ్జిపై రైలు పరుగులు తీస్తుంది.
- వంతెన కింద నుంచి ఓడలు సాఫీగా వెళ్లిపోతాయి. సముద్రంపై జీవించే మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా... సరుకు రవాణాకు అడ్డంకి కాకుండా అటు రైలు ప్రయాణాలు సాఫీగా సాగేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
- ఇప్పటికే సేఫ్టీ రన్స్ అన్నీ పూర్తయ్యాయి. కేంద్ర అనుమతితో త్వరలోనే దీనిపై రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఫలితంగా దేశంలోనే సముద్రంపై నిర్మించిన తొలి వర్టికల్ రైల్వే వంతెనగా పాంబన్ వర్టికల్ రైల్వే బ్రిడ్జి చరిత్రపుటల్లోకి ఎక్కనుంది.
Also Read: Pune News In Telugu: పూణెలో దారుణం- క్రికెట్ గ్రౌండ్‌లో ఆడుతూ 35 ఏళ్ల క్రికెటర్ మృతి