Nandyal News: చిన్నారులు తప్పులు రాస్తుంటే సరిదిద్ది, అది తప్పు.. ఇలా రాయలని చెప్పాల్సిన ఓ జిల్లా విద్యాశాఖాధికారి రాసిన నాలుగైదు లైన్లలో కనీసం 10 తప్పులు ఉన్నాయి. ఆ విషయం గుర్తించిన పిల్లలు, వారి తల్లిదండ్రులు నోటీసును నెట్టింట పెట్టారు. దీంతో తప్పుల తడకగా ఉన్న ఆ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రకటన ఇచ్చిన అధికారిపై కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 


అసలీ ఘటన ఎక్కడ జరిగిందంటే..? 


నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి వర్షాల నేపథ్యంలో సెలవులు గురించి ఓ ప్రకటన వచ్చింది. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు కారణాలను తెలియజేస్తూ వివరించారు. ఈక్రమంలోనే నోటీసులో అనేక అక్షర దోషాలు వచ్చాయి. దీంతో వీరిపై ట్రోలింగ్ మొదలు అయింది. 






ప్రకటన ఏంటంటే..?


"జిల్లా విద్యాశాఖ కార్యాయం, నంద్యాల, పత్రకా ప్రకటన, జిల్లాలోని అన్ని మండల విద్యాఖాకదికారులు యాజమాన్య పాఠశాలకు ప్రధానోపాద్యాయులకు తెలియజేయడమేమనగా, జిల్లా కలెక్టర్, నంద్యాల ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలకు రేపు నుంచి నాలుగు రోజులు పాఠశాలకు క్రింద కబరచిన విధముగా సెలవులు ప్రకించడమైనది. 
1.27.07.2022 - Holiday
2.28.07.2023 - Option Holiday
3.29.07.2023 - Public Holiday i.e Moharam
4.30.07.2023 - Sunday
తేదీ: 27.07.2023 ప్రకటించిన సెలవు దినముకు బదులుగా ఆగస్టు రెండవ శనివారం పాఠశాల నిర్వహించాలని అన్ని యాజమాన్య పాఠశాలకు ప్రధానోపాద్యాయులకు తెలియజేయడమైనది. పైపన తెలిపిన సెలవు దినములో పాఠశాల నిర్వహించిన యడల వారి పై కఠన చర్యలు తిసుకోనబడునని అన్ని యాజమాన్య పఠశాలకు ప్రదానోపాద్యాయులకు తెలియజేయడమైనది. మండల విద్యాశాఖదికారులు, ప్రధానోపాద్యాయులు తెలియజేయడమేమనగా నాడు నేడు సంభందించిన సిమెంట్ మరియు ఇతర వస్తువులు వర్షమునకు తడవకుండా గదిలో భద్రపచవలెనని ఆదేశిండమైనది."


ఈ ప్రకటన చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇన్ని తప్పులా అంటూ ముక్కున వేలేస్కుంటున్నారు. విద్యాశాఖాధికారికి వచ్చే భాష చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 


ఈ నాలుగు జిల్లాల బడులు బంద్


ఏపీలో గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నారు. వరుణ దేవుడి కరుణతో రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. అయినా వర్షం కురుస్తూనే ఉంది. ఈక్రమంలోనే ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ, నంద్యాల, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. కుండపోత వర్షాలతో రాష్ట్రమంతా చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 208 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.