ఆడవాళ్ళు ఎప్పుడూ అందంగా ఉండాలనే కోరుకుంటారు. వయసు మీద పడుతున్న కూడ యవ్వనంగా కనిపించేందుకు ముడతలు కవర్ చేసేందుకు మేకప్ ఎక్కువగా కొట్టేస్తారు. ముప్పై ఏళ్లు దాటిందంటే మెల్లగా ఫేస్ లో ఉన్న గ్లో కూడా తగ్గిపోతూ వస్తుంది. చర్మం ముదురుగా కనిపించడం, వృద్ధాప్య సంకేతాలు రావడం, మునుపటి మెరుపు లేకుండా పోతుంది. కానీ వీటిని తిన్నారంటే మాత్రం మీ వయసుని కాస్త తగ్గించుకోవచ్చు. ఒకరకంగా ఇవి యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనే చెప్పుకోవాలి. పోషకాలు నిండిన సమతుల్య ఆహారం వృద్ధాప్యాన్ని వెనక్కి నెట్టి అందమైన రూపాన్ని మీకు అందిస్తుంది. ఈ ఆహారాలు మీ అసలు వయసుని దాచేసి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. 30 ఏళ్లు దాటిన తర్వాత వీటిని తింటే బోలెడు ప్రయోజనాలు పొందుతారు. అవేంటంటే..


బెర్రీస్:  బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడేందుకు సహాయపడతాయి. ఇవి రెండూ వృద్ధాప్య సంకేతాలు కనిపించేలా చేసేందుకు దోహద పడతాయి. వీటిని నిరోధించాలంటే బెర్రీస్ ఉత్తమ ఎంపిక.


కొవ్వు చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వయసు సంబంధిత సమస్యల్ని తగ్గించి చర్మాన్ని యవ్వనంగా చూపించేలా చేయడంలో మెరుగ్గా పని చేస్తాయి.


ఆకుకూరలు: బచ్చలి కూర, కాలే వంటి ఆకుపచ్చని ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని, మొత్తం శ్రేయస్సుని ప్రోత్సహిస్తాయి. కంటికి కూడా మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి.


నట్స్: బాదం, వాల్ నట్, అవిసె గింజలు, చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. చర్మ స్థితిస్థాపతకకి ప్రయోజనకరంగా ఉంటాయి.


పెరుగు: ప్రొబయోటిక్ అధికంగా ఉండే పెరుగు పొట్ట ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది పోషకాల శోషణ, మొత్తం రోగనిరోధక శక్తి పనితీరుకి ఉపయోగపడుతుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. పెరుగుతో ఇతర పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.


పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. వయసు సంబంధిత సమస్యలు, వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. పసుపు, పాలు కలిపి పేస్ట్ రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.


గ్రీన్ టీ: గ్రీన్ టీ కాటేచిన్, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. యూజ్ చేసిన గ్రీన్ టీ బ్యాగ్ ని కళ్ల మీద ఉంచుకుంటే చల్లగా ఉంటుంది.


టొమాటో: టొమాటోలో లైకపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడేందుకు ఇది సహాయపడుతుంది. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది.


అవకాడో: అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ ఉన్నాయి. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.


డార్క్ చాక్లెట్: మితంగా డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: టీ అతిగా తాగేస్తున్నారా? జాగ్రత్త, ఐరన్ లోపమే కాదు ఈ సమస్యలు రావచ్చు


Join Us on Telegram:https://t.me/abpdesamofficial