పాములంటే ఎవరికైనా భయమే. ఒక్క పాము కనిపిస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది. అలాంటిది వందలాది పాములను ఒకే చోట చూస్తే? అవి కాటేయకుండానే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదూ. అయితే, ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. 300 పాములను సంచిలో వేసుకొచ్చిన ఆ వ్యక్తి ఏకంగా ఒకేసారి వాటిని వదిలిపెట్టాడు. అంతేగాక.. వాటిని చేతులతో అటూ ఇటూ కదుపుతూ క్షేమంగా అడవిలోకి చేరేందుకు సహకరించాడు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియరాలేదు. గోనె సంచిలో అన్నేసి పాములను తీసుకొచ్చి.. అలా వదిలిపెట్టడం చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఆ పాములన్నీ అతడి కాళ్ల మీదుగా చకచకా పాకేస్తున్నాయి. మరోవైపు అతడు ఒట్టి చేతులతోనే ఆ పాములను ముట్టుకోవడం చూసి మరింత షాకయ్యారు. అయితే, పాములంటే భయపడేవారు ఈ వీడియో చూడలేరు. ధైర్యం చేసి చూసినా.. నిద్రలో కూడా అవే గుర్తుకొస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వైరల్ వీడియో చూసేయండి మరి. 






అయితే, పాములతో సావాసం చేయడం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి పాములను పట్టే నిపుణులు కూడా ప్రమాదంలో చిక్కుకుంటారు. తాజాగా కేరళకు చెందిన వావా సురేష్ (48) అనే పాములను పట్టే వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కొట్టాయం జిల్లాలో పాములు పట్టడంలో సురేష్ బాగా ఫేమస్. సోమవారం కురిచి గ్రామంలో పాము తిరుగుతుందనే సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తున్న సమయంలో అది అతడి మోకాలిపై కాటేసింది. కొద్దిసేపటి తర్వాత సురేష్ అస్వస్థతకు గురయ్యాడు. గ్రామస్తులు అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సురేష్ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.