అతడు సినిమాలో ఓ పిల్లాడు చేతిలో గన్ పట్టుకొని రౌడీలను టపీ టపీ కాల్చేస్తుంటే విజిల్స్ వేశారు. అచ్చం అలాంటి సీన్ ఇప్పడు దిల్లీ పోలీసులను వణికించింది
దిల్లీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ముగ్గురు మైనర్లు నాటు తుపాకీతో చెలరేగిపోయారు. పార్క్‌లో కూర్చొని ఉన్న ఓ 36 ఏళ్ల వ్యక్తిని పాయింట్ బ్లాంక్‌లో కాల్చి పారిపోయారు. దీంతో ఆ వ్యక్తికి కుడి కన్ను భాగంలో గాయమైంది.
ఏఎన్‌ఐ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే... ముగ్గురు పిల్లలు ఆ వ్యక్తి వద్దకు రావడం గమనించ వచ్చు. వచ్చిన వారిలో ఓ బాలుడు తన చేతిలో ఉన్న తుపాకీని తీసి బాధితుడి తలపై గురి పెట్టి టప్‌ను కాల్చిన దృశ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాల్చేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఆ ముగ్గురు పిల్లలు పారిపోవడం కూడా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత అక్కడే ఉన్న వారంతా ఆ వ్యక్తి వద్దకు పరుగెత్తుకెళ్లిన సంగతి మనం చూడవచ్చు.
"జులై 15 సాయంత్రం 05.15 గంటలకు జావేద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగినట్టు జహంగీర్‌పురీ పోలీసులకు కాల్ వచ్చింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగనాని ఐఏఎన్‌ఎస్‌కు తెలిపారు. గాయపడిన వ్యక్తిని వెంటనే బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందన్నారు.
పోలీసులు సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు. నేరానికి కారణమైన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. "బాధితుడు సుమారు 7 నెలల క్రితం కాల్పులు జరిపిన పిల్లాడి తండ్రిని కొట్టాడట. దానికి ప్రతీకారంగా ఇలా నాటు తుపాకీతో కాల్చి వెళ్లినట్టు నిందితులు చెప్పినట్టు" డిసిపి చెప్పారు.