Janasena Tweets: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థం అయ్యేలా జనసేన కార్యకర్తలు డిజిటల్ ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుకి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఉదయం 8గం.కు పవన్ కల్యాణ్ కోనసీమలోని కొత్తపేట దగ్గర ఉన్న రోడ్డు ఛిద్రమై ఉన్న వీడియోను పోస్ట్ చేసి #GoodMorningCMSir అని ట్యాగ్ చేశారు. అలాగే ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. ట్వీట్స్ మొదలైన తొలి రెండు గంటల్లోనే ట్రెండింగ్లో 1వ స్థానానికి చేరింది.


3 లక్షల 55 వేల ట్వీట్లు... మామూలుగా లేదుగా


ఇలా జనసేన అధినేత పెట్టిన హ్యాష్ టాగ్ తోనే జనసైనికులు కూడా ట్వీట్లు చేశారు. కొన్ని గంటల్లోనే దాదాపు 3.55 లక్షల ట్వీట్లు చేసి సీఎం జగన్ కు చుక్కలు చూపించారు. వీటి ద్వారా రాష్ట్రంలోని నలుమూలల నుంచీ గతుకులమయమై నరకప్రాయంగా ఉన్న రోడ్లను చెప్పే ఫోటోలను, వీడియోలను పోస్టు చేశారు. ఈ ట్వీట్స్ 218 మిలియన్ల మందికి చేరువైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు యువతు కూడా భారీగా పాల్గొన్నారు. 



 


రోడ్ల దుస్థితిపై ఫొటోలు, వీడియోలు..


అలాగే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా శుక్రవారం ఉదయం మండపేట నియోజకవర్గంలోని కోరుమిల్లి, కపిలేశ్వరపురం వెళ్ళే రోడ్డులోని గోతులను చూపిస్తూ ట్వీట్ చేశారు. ఆ తరవాత కోరుమిల్లి – జొన్నాడ రోడ్డునీ, కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం-కాకినాడ ప్రధాన రోడ్డు దుస్థితినీ తెలుపుతూ ట్వీట్స్ చేశారు. ఉదయం నుంచి ఈ ట్వీట్లు షేర్ అవుతూనే ఉన్నాయి. 


నోరుమెదపని అధికార పార్టీ నేతలు..


అప్పులు చేసిన నవరత్నాలు పంచడం కాదు.. రోడ్లు వేయండంటూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మధ్య ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా వేలాది మంది రోడ్ల పరిస్థితిని చూపిస్తూ ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు. మరోసారి ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, వైసీపీ నేతలు, కార్యకర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే భయపడిపోతున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక చాలా మంది  వైసీపీ నేతలు, నాయకులు మిన్నుకుండిపోతున్నారు. విపక్షాల ప్రశ్నలకు ఎప్పుడూ సమాధానాలు చెప్పే పెద్ద పెద్ద నేతలు, మంత్రులు కూడా నోరు మెదపడం లేదు.