Attack on TDP Cadres: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని అంతరకుడ్డ గ్రామంలో రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తొలుత టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీకి చెందిన పలువురు వ్యక్తులు గొర్రెల శాలలో ఉండగా.. కత్తులు, పారలతో వచ్చిన వైసీపీ వర్గీయులు దాడి చేశారు. విషయం గ్రహించిన తెదేపా కార్యకర్తలు కూడా ఎదురు దాడికి దిగారు. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకున్నారు. ఘటన జరుగతున్న ప్రాంతమంతా రక్తమోడుతున్న పట్టించుకోకుండా ప్రణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
రణరంగంగా మారిన గొర్రెల శాల..
పోలీసు లు, గ్రామస్థుల వివరాల మేరకు.. అంతరకుడ్డ గ్రామంలో టీడీపీకి చెందిన వంకల కృష్ణమూర్తి, ఆయన కుమారులు వంకల లక్ష్మణ రావు, వంకల గోపి తమకు చెందిన గొర్రెల శాలలో జీవాలను కట్టేస్తుండగా వైసీపీకి చెందిన దుబ్బ శ్రావణ్, దుబ్బ ధర్మారావు, దుబ్బ శరత్, పీత అప్పయ్య, పీత లక్ష్మణ రావు కత్తులు, పారలు తీసుకుని వచ్చి దాడులు చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేశారు. దీంతో టీడీపీకి చెందిన లక్ష్మణరావు ఎడమ చేయి విరిగిపోయింది. గోపి, కృష్ణమూర్తికు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీకి చెందిన దుబ్బకు, పీత అప్పయ్య, దుబ్బ శ్రావణ్, దుబ్బ శరత్ తల, చేతిపై గాయాలయ్యాయి. విపరీతమైన శబ్దాలు రావడంతో స్థానిక ప్రజలంతా వారి గొడవను ఆపారు.
పాత కక్షలే కారణమంటున్న గ్రామస్థులు...
అయితే ఈ ఘటనలో గాయపడ్డ వారందరినీ వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. టీడీపీకి చెందిన లక్ష్మణరావు, గోపి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాకుళం తరలించారు. పాతకక్షలతో తమ కుటుంబాన్ని అంతమొందించేందుకే వైసీపీ వర్గీయులు కత్తులు, పారలతో దాడి చేశారని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు. కాగా వీరిరువురి మధ్య నాలుగు నెలల క్రితం గొర్రెల మంద వ్యవహారంలో ఘర్షణ జరిగింది.
తమ గొర్రెల మందలో కలసిపోతు న్నాయంటూ ఇరు వర్గాలు తగాదా పడ్డారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తరచుగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ వర్హీయులు పథకం ప్రకారం దాడి చేశారు. తెదేపా వర్గీయులు కూడా ప్రతిదాడి చేయడంతో అందరూ గాయపడ్డారు. ఏఢుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి మరీ ఆందోళన కరంగా ఉంది.
దాడిపై డీఎస్పీ ఆరా...
ఆసుపత్రిలో క్షతగాత్రులను కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి పరామర్శించారు. గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేయాలని సీఐ ఎస్. శంకర రావును ఆదేశించారు. కాశీబుగ్గ ఎస్ఐ మధు సూధనరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి, గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని..దర్యాప్తు కూడా చేస్తున్నమని సీఐ తెలిపారు.