Minister Indrakaran Reddy: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. జిల్లా వ్యాప్త్గంగా ఉన్న వాగులు, వంకలన్నీ పూర్తిగా నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే ఇంకా వరద ప్రభావం కూడా పూర్తిగా తగ్గలేదు. ఈ భారీ వర్షానికి అన్నదాలతు విపరీతంగా నష్టపోయారు. ముందుగా పంటలు వేసిన పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అప్పో సొప్పో చేసిన వేసిన పంట.. పూర్తిగా నీటి పాలైంది. చాలా మంది నిరుపేదలు ఇళ్లు లేని వారిగా మారిపోయారు. మరెంతో మందికి జీవనాధారమైన పశువులను పోగొట్టుకొని నరకం చూస్తున్నారు.
అన్నదాతలను ఆదుకుంటాం.. ఆందోళన వద్దు..
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలతో పాటు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. అలాగే విపక్షాలు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో భారీ వర్షాలు వరదలకు సంబంధించి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, జిల్లా ఉన్నతధికారులు, తదితరులు ఉన్నారు.
నీటమునిగిన వేల ఎకరాల పంట..
భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయమని, అనేక ప్రాంతాల్లో రహదారులు కోతకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే దీన్నే అనువుగా వాడుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఇది సరైన పద్ధతి కాదని.. వీలైతే మీరు కూడా వరద బాధితులను ఆదుకోండని చెప్పారు. ఆఫదలో ఉన్న వారికి సాయం చేయాలే తప్ప.. వారి అవసరాలను అదునుగా చేస్కొని రాజకీయం చేయకూడదని హితబోధ చేశారు.
కేంద్ర ప్రభుత్వమూ సాయం చేయాలి..
అలాగే మంచిర్యాల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైందని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. వానలు, వరదలు ఉన్నన్ని రోజులు సీఎం కేసీఈర్ ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ... అధికారులు సలహాలు, సూచనలిచ్చారని... కనీసం రోజుకు 16 గంటలు ఇదే పనిలో ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు క్షేత్ర స్థాయిలో.. ముఖ్యంగా సమస్యలు ఉన్న చోటే ఉండి పరిష్కరించాలని చెప్పారని వివరించారు. ఇదే తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.