Narendra singh Tomar Praises AP Govt schemes: ఏపీ వ్యవసాయ శాఖకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కితాబిచ్చారు. ఏపీలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఆ విషయంలో ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల పనితీరుని ఆయన ప్రశంసించారు. ఆర్బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు మంత్రి తోమర్. ఆర్బీకేలతోపాటు.. ఏపీలో అమలు చేస్తున్న ఈ క్రాపింగ్, ప్రకృతి సేద్యాన్ని కూడా ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బెంగళూరులో జరిగిన వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రుల సదస్సులో పాల్గొన్న ఆయన.. ఏపీని ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ తరఫున హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఆయన ప్రశంసించారు. 


బెంగళూరులో రెండురోజులపాటు వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రుల జాతీయసదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ తరపున వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఇంచార్జ్‌ కమిషనర్‌ డాక్టర్‌ గడ్డం శేఖర్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రసంగించిన కాకాణి గోవర్దన్ రెడ్డి, రైతులకోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. రైతుభరోసా - పీఎం కిసాన్‌ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతు ఖాతాల్లో ప్రతి ఏటా రూ.13,500 జమచేస్తోందని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. కేంద్రం అందిస్తున్న 6 వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చెల్లిస్తోందని వివరించారు. ఒకేసారి కాకుండా విడతలవారీగా రైతులకు అవసరమైన సమయంలో రైతు భరోసా సొమ్ము జమ చేస్తున్నామని చెప్పారు.




సీజన్‌కు ముందే రైతు భరోసా నగదు సాయం.. 
ఖరీఫ్‌ సీజన్‌ కు ముందు మే నెలలో, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌ నెలలో రైతు భరోసా సొమ్ము అందిస్తున్నట్టు మంత్రి కాకాణి తెలిపారు. ఇక కేంద్రం ఇస్తున్న 6 వేలను మూడు విడతల్లో కాకుండా రెండు విడతల్లోనే ఇవ్వాలని సూచించారు కాకాణి. రైతు భరోసా మాదిరిగానే మే నెలలో రూ.3 వేలు, అక్టోబర్‌లో రూ.3 వేలు సర్దుబాటు చేస్తే రైతులకు మరింత ఉపయోగం కలుగుతుందని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు ఏపీ మంత్రి కాకాణి వివరించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ఏపీ వరకు తప్పనిసరిగా ఈ ప్రతిపాదన పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ–క్రాప్‌తో అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను కూడా రైతులందరికీ వర్తింపజేస్తామని కూడా నరేంద్ర సింగ్ తోమర్ హామీ ఇచ్చారు. 


ప్రకృతి సేద్యంపై కేంద్రం ప్రత్యేకదృష్టి 
కేంద్రం చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన కొత్త పథకాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ కూడా సదస్సులో వివరించారు. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రకృతిసేద్యంపై కేంద్రం ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు మంత్రి. ఇప్పటికే ఏపీలో ఈ తరహా ప్రకృతిసేద్యాన్ని పెద్దఎత్తున స్థానిక ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. లక్షలాదిమంది రైతులు ఇప్పటికే ప్రకృతిసేద్యం వైపు వెళ్లారని తెలిపారు. ఈ విషయంలో ఏపీని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వ్యవసాయ విధానాల్లో మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. 
Also Read: Rains in AP Telangana: ఏపీలో నేడు ఓ మోస్తరు వర్షాలు - జూలై 20 వరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్: IMD


ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి సాగు ఉత్పాదకాలను నేరుగా రైతుల ముంగిటకు తీసుకువెళ్లడం అభినందనీయం అన్నారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలతోపాటు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కూడా ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారని అభినందించారు ఈ–క్రాప్‌ను ప్రామాణికంగా తీసుకుని వాస్తవ సాగుదారులకు ఏపీలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న విధానం ఆదర్శనీయంగా ఉందని చెప్పారు కేంద్ర మంత్రి తోమర్.