Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy: ఆ మధ్య నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురికి కాల్వలో నిరసనకు దిగడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి అక్కడ డ్రైనేజీ కాల్వలో దిగి అధికారుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సరిగ్గా పదిరోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఆయన ప్రయత్నాన్ని చాలా మంది మెచ్చుకున్నారు, అధికార పార్టీ నేత అయినప్పటికీ కూడా పనులు జరిపించుకోలేకపోవడమేంటని కొందరు గుసగుసలాడుకున్నారు. సీన్ కట్ చేస్తే, సరిగ్గా 10 రోజులకి ఆయన అనుకున్న పని సాధించారు. డ్రైనేజీ పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేశారు. గునపం దింపి పనులు మొదలు పెట్టారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ కాలువ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ నీళ్లన్నీ రోడ్లపైకి పొంగిపొర్లి, వర్షాకాలంలో ఇళ్లలోకి వచ్చేస్తాయి. కనీసం డ్రైనేజీపై చిన్న బ్రిడ్జ్ కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో అదే ప్రాంతంలో డ్రైనేజీలోకి దిగి నిరసన తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఆ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆయన మరోసారి అదే ప్రయత్నం చేశారు. తాను కాల్వలో దిగితేనైనా సమస్య పరిష్కారమవుతుందేమో చూద్దామన్నారు. డ్రైనేజీలోకి దిగి తన నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం హైలెట్ అయింది. వెంటనే అధికారులు దిగొచ్చారు. 14 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ కాలవ పనలు మొదలు పెట్టారు.
ఈ డ్రైనేజీ కాల్వ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రైనేజీ కాల్వ పనుల్ని 41 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. సహకరించిన రైల్వే అధికారులకు, కార్పొరేషన్ అధికారులకు, కాంట్రాక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారాయన. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో తాను అధికార పక్షమా, ప్రతిపక్షమా అనేది చూడనని ఎప్పుడూ ప్రజాపక్షమేనన్నారు శ్రీధర్ రెడ్డి. సీఎం జగన్ 62 కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కేటాయించారని, రోడ్లు భవనాలశాఖ, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో.. రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా సంవత్సరాల తరబడి తమను వేధిస్తున్న సమస్య తీరిపోయినట్టేనని చెప్పారు స్థానికులు. రూరల్ ఎమ్మెల్యే వల్లే తమ సమస్య పరిష్కారమైందంటూ.. ఆయనకు పూలతో ఘన స్వాగతం పలికారు.
Also Read: YSR Vahana Mitra Money: ఏపీలో వారి ఖాతాల్లో రూ.10వేలు జమ చేసిన సీఎం జగన్, దేశంలో ఎక్కడా లేని పథకం