ఝార్ఖండ్ రోప్‌వేలో ప్రమాద స్థలంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. భారత వైమానిక దళం(IAF)కు చెందిన రెస్క్యూ హెలికాప్టర్ నుంచి జారిపడి ఓ వ్యక్తి చనిపోయాడు.
ఆదివారం సాయంత్రం దియోఘర్ జిల్లా త్రికూట్ పర్వతాల వద్ద ఉన్న రోప్‌వేలోని కేబుల్ కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 42 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు భారత సైన్యం, వాయుసేన, ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
రోప్‌వే కార్ కేబిన్లలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రెండు ఎమ్ఐ-17 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌కు చెందిన ఓ వ్యక్తిని భారత వైమానిక దళం హెలికాప్టర్‌లోకి లాగేందుకు ప్రయత్నించింది. ఆ క్షణంలో ఏమైందో ఏమో.. హెలికాప్టర్ వరకు చేరుకున్న తర్వాత అతడు తాడుకు వేలాడుతూ కనిపించాడు. హెలికాప్టర్‌లో ఉన్న జవాన్లు అతడిని పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత ఆ వ్యక్తి హెలికాప్టర్ పై నుంచి లోయలో పడిపోయాడు.
అతడు హెలికాప్టర్‌లోకి చేరుకొనే సమయంలో ఛాపర్ బ్లేడ్‌ల నుంచి వేగం వీస్తున్న గాలిని ఎదుర్కోడానికి ఇబ్బందిపడినట్లు కనిపించింది. సరిగ్గా హెలికాప్టర్‌లోకి వెళ్తున్నాడు అని భావించే సమయానికి అతడు అకస్మాత్తుగా అంత ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం, ప్రాణాలతో బయటపడతాడని భావిస్తే.. ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడని నెటిజనులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం సాయంత్రం వరకు సుమారు 25 మందిని రక్షించారు. ఇంకా 23 మందిని కాపాడాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీరామనవమి పురస్కరించుకుని అధిక సంఖ్యలో పర్యటకులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ దగ్గర్లోనే బైధ్యనాథ్ ఆలయం కూడా ఉంది. అయితే రోప్‌వేలో ఆకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కేబుల్ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో రోప్‌వేలో వెళ్తున్న మిగతా కార్లు పరస్పరం ఢీకొన్నాయి. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి
ఈ ఘటన జరిగిన సమయంలో రోప్వేకు సంబంధించిన 19 కేబుల్ కార్లలో 70 మంది పర్యటకులు చిక్కుకుపోయారు. ఇందులో కొంతమందిని అధికారులు కాపాడారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
వీడియో: